మాస్ చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, ప్రేమకథా చిత్రాలు, పౌరాణిక చిత్రాలు, కామెడీ చిత్రాలు.. ఈ జోనర్లను అప్పటికే కె.వి.రెడ్డి, దాసరి నారాయణ రావు,కె.రాఘవేంద్ర రావు, జంధ్యాల.. వంటి వారు ఇరగదీసి, అరగదీసి, విస్తరేసేసారు. ఓ ట్రెండ్ సెట్ చేసి.. మాకు మేమే పోటీ అనే స్థాయిలో స్థిరపడ్డారు. ఈ స్టార్ డైరెక్టర్లను మరిపించి ఓ బ్లాక్ బస్టర్ ఇవ్వాలంటే.. ఆ టైములో ఎంత కష్టం. మాటల్లో చెప్పాలంటే.. ఇలాగే ఉంటుంది. కానీ దివంగత స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు.. ‘తలుచుకుంటే ఏది అసాధ్యం కాదని’ నిరూపించాడు. నిజానికి ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ ‘అంకుశం’ వంటి సినిమాలను తీసిన కోడి రామకృష్ణ..
వాటిని మించి ఏ సినిమా తియ్యగలడు. అతని ప్రత్యేకతను ఎలా చాటుకోగలడు. ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వచ్చిన తరుణంలో ‘అమ్మోరు’ అనే సినిమా తీసాడు. సినిమాలో స్టార్ హీరో లేడు, ఆకర్షించే పాటలు లేవు, ప్రేమ కథ లేదు… అప్పటివరకూ ఓ ట్రాక్ ను బలంగా నమ్మి ఎంటెర్టైమెంట్ ఫీలయ్యే ప్రేక్షకుడికి.. ఆ ఎలిమెంట్స్ ఏవి ఈ సినిమాలో లేవు. అయినప్పటికీ ‘అమ్మోరు’ చిత్రం స్టార్ హీరోల సినిమాలను మించి బ్లాక్ బస్టర్ అయ్యింది. గ్లాఫిక్స్ పెద్దగా ప్రాచుర్యం పొందని రోజుల్లో కూడా ఓ విజువల్ వండర్ ను అందించారు కోడి రామకృష్ణ. ఇప్పుడంటే మనం శంకర్, రాజమౌళి లనే మెచ్చుకుంటున్నాం.
కానీ ‘అమ్మోరు’ సినిమాతోనే మంచి టెక్నికల్ వాల్యూస్ కలిగిన సినిమాని ప్రేక్షకులకు పరిచయం చేశారు కోడి రామకృష్ణ. ఈ చిత్రాన్ని థియేటర్లో వీక్షించిన ప్రేక్షకులు.. ఆ టైములో నిజంగానే అమ్మోరు పూనినట్టు గంతులు వేసారట. అంతేకాదు థియేటర్ ఎంట్రన్స్ లో గుడివాతావరాన్ని ఏర్పాటు చేసి పూజలు వంటివి చేశారట. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న టైములో ‘స్టార్ హీరో లేకుండా అంత బడ్జెట్ పెడుతున్నావ్. మతిపోయిందా’ అంటూ ఇండస్ట్రీలోని పెద్దలు కూడా భయపెట్టారట. కానీ ‘అమ్మోరు’ సినిమా పెట్టిన బడ్జెట్ కు రెండింతల లాభాలను అందించింది. దాంతో మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరో కూడా ఆశ్చర్యపోయి.. ‘నాతో కూడా ఇలాంటి సినిమా ఒకటి చెయ్యాలని’ కోడి రామకృష్ణ గారిని కోరారట. అలా ‘అంజి’ చిత్రానికి భీజం పడినట్టు కూడా అప్పటి పెద్దలు చెప్పుకొచ్చారు.