Chiru – Odela: చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల సినిమా.. మళ్లీ గతంలోకే అంటున్న నిర్మాత
- January 20, 2026 / 05:59 PM ISTByFilmy Focus Desk
మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో సినిమాను 2024 డిసెంబరు మొదటి వారంలో ఈ సినిమాను ప్రకటించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా, యువ కథానాయకుడు నాని సమర్పకుడిగా ఈ సినిమాను ఘనంగా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి చాలా రోజులు అప్‌డేట్ ఇవ్వని నిర్మాణ సంస్థలు ఇటీవల చిన్న అప్‌డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో అప్‌డేట్ ఇచ్చారు.
Chiru – Odela
శ్రీకాంత్ ఓదెల- చిరంజీవి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ‘ప్యారడైజ్’ సినిమా ప్రొడక్షన్ పనులు సమాంతరంగా జరుగుతున్నాయనే విషయం తెలిసిందే. అలా చేయగలిగారు కాబట్టే.. ఇప్పుడు ఆ సినిమా విడుదలైన రెండు నెలల్లోనే చిరంజీవి సినిమాను ప్రారంభించడానికి శ్రీకాంత్ ఓదెల సిద్ధంగా ఉన్నారట. ఈ మేరకు నిర్మాత సుధాకర్ చెరుకూరి ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమా 1970 నేపథ్యంలో సాగే పీరియాడిక్ కథ అని కూడా చెప్పారు.

నిజానికి ప్రస్తుతం టాలీవుడ్‌లో పీరియాడిక్ కథలకు మంచి స్పందన వస్తోంది. పాత రోజులకు వెళ్లి అప్పటి కథలను ఇప్పుడు హీరోలు చేస్తుంటే ఆసక్తిగా చూసేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల ఇలాంటి కథలను తెరకెక్కించడంలో దిట్ట అని ‘దసరా’ సినిమా చూస్తే అర్థమైపోయింది. ఇప్పుడు నానితో మళ్లీ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ కూడా అలాంటి కథనే. కాబట్టి ఆయనకు ఈ జోనర్ కొట్టినపిండి. అయితే ఇప్పుడు చిరంజీవిని ఎలా చూపిస్తారు అనేదే చూడాలి.
ఇక ప్రస్తుతం చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా బ్లాక్‌బస్టర్ విజయంతో బిజీగా, సంతోషంగా ఉన్నారు. ఆ సినిమా తొలి వారం వసూళ్లు రూ.300 కోట్లు దాటిపోయాయి. అదే ఊపులో బాబీ సినిమాను త్వరలో స్టార్ట్ చేసేస్తారు. మార్చిలో షూటింగ్ ఉంటుంది. ఓ షెడ్యూల్ అయ్యాక ‘విశ్వంభర’ కోసం చిన్న గ్యాప్ ఇచ్చి.. మళ్లీ బాబీ సినిమాకు వచ్చి పూర్తి చేస్తారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల సినిమా సెట్‌లో అడుగుపెడతారని సమాచారం.














