అశోక్.. ఊసరవెల్లి.. టెంపర్ .. ఈ మూడు సినిమాలకు వక్కంతం వంశీ, ఎన్టీఆర్ కలిసి పనిచేశారు. చిన్నప్పటి నుంచి వీరిద్దరూ మిత్రులు. టెంపర్ హిట్ కావడంతో వంశీని డైరక్టర్ పరిచయం చేయాలనీ అనుకున్నారు. జనతాగ్యారేజ్ తర్వాత అతని దర్శకత్వంలోనే నటించడానికి సిద్ధమయ్యారు. వంశీ కూడా ఆనందంతో ఉన్నారు. కానీ బాబీతో జై లవకుశ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని, దూరం పెరిగిందని ప్రచారం సాగింది. అప్పట్లో దీనిపై ఇద్దరూ నోరుమెదపలేదు. అయితే వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న “నా పేరు సూర్య” మూవీ నేడు రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది.
ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన వంశీ.. ఎన్టీఆర్ తో గొడవలపై స్పందించారు. “ఎన్టీఆర్ తోనేను గొడవ పడిన వార్తల్లో నిజం లేదు. నిజానికి నన్ను దర్శకుడిగా మారమని ప్రోత్సహించిన వ్యక్తి ఎన్టీయార్. ఆయనతోనే నా తొలి సినిమా చేద్దామనుకున్నాను. కథ కూడా సిద్ధం చేశా. అయితే అది వర్కవుట్ అవుతుందని అనిపించలేదు. దాంతో ఆ ప్రాజెక్టు ఆపేశాం. తర్వాత బన్నీ కోసం కథ ఉంటే చెప్పమని బుజ్జిగారు అడిగారు. దాంతో “నా పేరు సూర్య” కథ రెడీ చేశాను” అని వక్కంతం వంశీ వివరించారు. భవిష్యత్తులో వీరి కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.