విజయ్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో దిల్ రాజు నిర్మించిన చిత్రం ‘వరిసు’. తెలుగులో ‘వారసుడు’గా రాబోతున్న ఈ సినిమాకు అప్పుడే ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. మీరు అనుకుంటున్నట్లుగానే రివ్యూయర్ అని చెప్పుకుంటున్న ఆయనే ఈ రివ్యూ ఇచ్చారు. అయితే ఈ రివ్యూ పాజిటివ్‌గా ఉండటంతో.. అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఆయన రివ్యూలను నమ్మి మోసపోయిన ఫ్యాన్స్ మాత్రం ‘చాల్లే చాల్లే చెప్పొచ్చావ్’ అని కామెంట్స్ చేస్తున్నారు.
సంక్రాంతి కానుకగా ఈ నెల 11న ‘వరిసు’ విడుదలవుతోంది. సినిమాను తమిళనాడులో ఈ నెల 11న భారీ ఎత్తున సినిమాను విడుదల చేస్తున్నారు. అయితే తెలుగులో తేదీ మారుతుంది అంటున్నారు. ఆ విషయం పక్కనడితే.. భారీ అంచనాల నడుమ విడుదలవుతోన్న ‘వరిసు’ సినిమాకు విడుదలకు మూడు రోజుల ముందే ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు దుబాయ్ నుండి ‘వరిసు’ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు.
‘వరిసు’ సినిమాకు 3.5 రేటింగ్ ఇచ్చిన ఉమైర్ సంధు.. సినిమా ఎలా ఉందో చెబుతూ వరుస ట్వీట్లు చేశాడు. సింపుల్ కంటెంట్‌ను ఎమోషన్స్‌తో నింపేశారని చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్లూ మేనరిజం, డైలాగ్స్‌తో అలరించిన విజయ్ ఈసారి ఫ్యామిలీ ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించాడని పొగిడేశాడు. తల్లిదండ్రులు – బిడ్డల మధ్య అనుబంధాలను బాగా చూపించారట. అయితే, సినిమా ఫస్టాఫ్, ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలను తీసేసినా ఫర్వాలేదు అని చెప్పారు. సుమారు పావు గంట సినిమాను కోసేయొచ్చు అని చెప్పాడు.
అయితే, అసలు ఉమైర్ సంధు చెప్పిన రివ్యూ కరక్టేనా అనేది ఎప్పటిలా ఉండే ప్రశ్నే. ఎందుకంటే సంధు చెప్పిన రివ్యూలు నూటికి నూరు శాతం కరెక్ట్ అని ఎప్పుడూ చెప్పలేం. డిజాస్టర్ సినిమాలాగా, డిజాస్టర్ రివ్యూలు ఇవ్వడం ఆయనే సాధ్యం. మరి ఈ సినిమా విషయంలో ఉమైర్ సంధు చెప్పింది నిజమవుతుందేమో చూడాలి. అన్నట్లు 11న ‘వారసుడు’ వస్తాడా లేదా అనేది ఈ రోజు తేలుతుంది అంటున్నారు.