టాలీవుడ్‌లో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా విజయం అందుకున్న చిత్రం ‘ఫిదా’. సగటు తెలుగు సినిమాకు కాస్త దూరంగా, తెలంగాణ పల్లెలకు దగ్గరగా, నేటి తరం యువత ఆలోచనలకు చాలా దగ్గరగా తీసిన చిత్రమిది. వరుణ్ తేజ్, సాయిపల్లవి కెరీర్‌లో బెస్ట్ సినిమాగా నిలిచింది. అయితే అంతా శేఖర్ కమ్ముల అనుకున్నట్లుగా జరిగితే, ఈ మాటలన్నీ మహేష్‌బాబు గురించో, రామ్‌చరణ్ గురించో మాట్లాడుకునేవాళ్లం. ఎందుకంటే ఈ సినిమా కథను ఆయన తొలుత చెప్పింది వారిద్దరికే.
‘ఫిదా’ సినిమాను తెరకెక్కించే ముందు శేఖర్ కమ్ముల చాలా రోజుల ఖాళీగా ఉన్నారు. ఆ సమయంలో స్టార్ హీరోలకు కూడా కొన్ని కథలు చెప్పారని, అవి ఓకే అవ్వలేదని వార్తలొచ్చాయి. అయితే ఆ కథలేంటి, వాళ్లెందుకు ఓకే చేయలేదు అనేవి అప్పుడు తెలియలేదు. అయితే అప్పుడు వారికి శేఖర్ కమ్ముల చెప్పిన కథ ‘ఫిదా’ అని ఇటీవల తెలిసింది. అయితే వారిద్దరూ ఆ కథను ఎందుకు ఓకే చేయలేదు అనేది తెలియ లేదు. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
శేకర్ కమ్ముల స్టార్ హీరోలతో సినిమాలు చేయరు అని చాలా మంది అంటుంటారు. దానికి కారణం తెలియదు అని కూడా అంటుంటారు. ఇటీవల ఇదే మాటను ఓ టీవీ షో హోస్ట్ శేఖర్ కమ్ములను అడిగారు. అప్పుడే ఈ ‘ఫిదా’ కథ బయటకు వచ్చింది. ఆ సినిమా కథ స్టార్ హీరోలకు తగ్గట్టుగా లేకపోవడమే కారణమని సినిమా చూస్తే అర్థమవుతుంది. హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా ఉండే కథ అది. ఈ సమయంలో మహేష్, రామ్‌చరణ్ అలాంటి కథ చేస్తారు అనుకోవడం అత్యాశే మరి.