ఒకప్పుడు మంచి హారర్ సినిమాలు, థ్రిల్లర్లు చూడాలంటే హాలీవుడ్, కొరియన్ లేదా జపనీస్ సినిమాల మీద ఆధారపడాల్సి వచ్చేది. మన సినిమాలు ఎందుకో ఆ స్థాయి కిక్ ఇచ్చేవి కావు. కానీ.. ఇప్పుడు సీన్ మారింది. హాలీవుడ్ కూడా మన ఇండియన్ సినిమాల నుంచి ఇన్స్పైర్ అవుతుంది. దానికి సరికొత్త ఉదాహరణ గుజరాతీ చిత్రం “వశ్ లెవల్ 2”. నిజానికి ఈ సినిమా ఓ సీక్వెల్. మొదటి భాగం పెద్ద హిట్ అవ్వడంతో హిందీలో “సైతాన్” పేరుతో అజయ్ దేవగన్ రీమేక్ చేశాడు.
ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదలైన “వశ్ 2”కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే చాలా తక్కువ థియేటర్లలో రిలీజ్ అవ్వడం, గుజరాతీ సినిమా కావడంతో ఎక్కువమంది ఆ సినిమాని చూడలేకపోయారు. అయితే.. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న “వశ్ 2” విశేషమైన ఆదరణ చూరగొంటోంది. వశీకరణ శక్తితో ఒక దుర్మార్గుడు సృష్టించిన హింస ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి సున్నిత మనస్కులు దూరంగా ఉండడం బెటర్.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సరిగ్గా ఆగస్ట్ నెలలో విడుదలైన హాలీవుడ్ చిత్రం “వెపన్స్” కూడా ఇదే తరహా కాన్సెప్ట్ సినిమా. నిజానికి “వెపన్స్ & వశ్ 2”లో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. షాట్ మేకింగ్ విషయంలో ఆ సిమిలారిటీస్ మరీ స్పష్టంగా కనిపిస్తాయి. రెండు సినిమాలు ఒకే నెలలో విడుదలయ్యాయి కాబట్టి ఎవర్ని ఎవరూ కాపీ కొట్టలేదు అని స్పష్టమవుతుంది. ఏదేమైనా.. ఒక గుజరాతీ సినిమా ఇలా హాలివుడ్ స్థాయి హారర్ ఎలిమెంట్స్ & స్టోరీ టెల్లింగ్ తో ఆకట్టుకోవడం విశేషం అనే చెప్పాలి.
ఇకపోతే.. ఈ “వశ్2”లో ఈమధ్య తెలుగులో కనిపించకుండాపోయిన మోనాల్ గజ్జర్ కీలకపాత్రలో కనిపించింది. అప్పట్లో ఈ సినిమాని తెలుగులో డబ్బింగ్ రూపంలో విడుదల చేసేందుకు బన్నీ వాస్ ప్రయత్నించారు కానీ.. ఎందుకో వర్కవుట్ అవ్వలేదు. మరి ఇప్పుడు రీమేక్ చేసే ఆలోచన ఏమైనా ఉందో లేదో మరి!