వెంకీ ఆసన్ అని ఒకటి ఉంటుంది మీకు గుర్తుందా? ‘ఎఫ్ 2’ సినిమాలో ఆయన ఆ ఆసనం వేసి తన టెన్షన్‌ను తగ్గించుకుంటాడు. ఆ సినిమా వచ్చిన రోజుల్లో ఆ ఆసనం బాగా పాపులర్ కూడా. ఆ ఒక్క సీన్‌ను రీక్రియేట్ చేస్తూనే సినిమాను ప్రమోట్ చేశారు ఆ రోజుల్లో. ఆ ఆసనం వల్ల టెన్షన్ నిజంగా తగ్గుద్దో లేదో తెలియదు కానీ.. ఇప్పుడు చెప్పిన నాలుగు విషయాల వల్ల అయితే కచ్చితంగా తగ్గుతుంది అని చెబుతున్నారు వెంకటేశ్.
జనాలు ఎక్కువగా ఆందోళనకు గురికావడానికి కారణం వచ్చిన ఫలితాన్ని అంగీకరించలేకపోవడమే అని వెంకటేశ్ చెప్పారు. రానా దగ్గుబాటి షో అనే ఓటీటీ టాక్‌షో లేటెస్ట్ ఎపిసోడ్‌కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా టీమ్ వచ్చింది. ఈ సందర్భంగా తాను ఆచరిస్తున్న నాలుగు జీవిత సూత్రాలను వెంకటేశ్ చెప్పాడు. వాటిని పాటిస్తే జీవితంలో టెన్షన్ అనేది ఇబ్బంది పెట్టదు అని క్లారిటీ ఇచ్చాడు.
తాను జీవితంలో నాలుగు విషయాలను కచ్చితంగా పాటిస్తానని చెప్పారు వెంకటేశ్. కష్టపడటం, నివేదించటం, బయటకు వచ్చేయడం, అంగీకరించడమే ఆ నాలుగు విషయాలని చెప్పారు వెంకీ. మనం ఏ పని చేసినా కచ్చితంగా కష్టపడాలి. పని అయిన తర్వాత దాని ఫలితాన్ని ప్రపంచానికే వదిలేయాలి. అలాగే బయటపడటం, ఫలితాన్ని అంగీకరించడం కూడా పాటించాలి అని చెప్పారాయన.
ధ్యానం, గురువులు ఇచ్చిన సలహాలు స్వీకరించడం వల్ల తనకు ఈ ఆలోచన విధానం వచ్చిందని చెప్పారు వెంకీ. వివరంగా చెప్పొచ్చు కదా అంటే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కష్టపడి చేశానని, ఇప్పుడు దానినుంచి బయటకు వచ్చేశానని, ఫలితం ఏది వచ్చినా తీసుకుంటానని చెప్పారు. మరి వెంకీ చెప్పినట్లు తన కష్టాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారో తెలియాలంటే ఈ నెల 14 వరకు ఆగాల్సిందే.
వెంకటేశ్, ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి నటించిన ఈ సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఎక్స్ పోలీసు, ఎక్స్‌లెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ మధ్య సాగే త్రికోణం కామెడీ కుటుంబ కథ.