సినిమా ప్రపంచంలో విజయాలు, అపజయాలు హీరోల కెరీర్‌పై ఎంతటి ప్రభావం చూపిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ సినిమా హిట్ అయితే, ఆ మూడ్ కొనసాగించేందుకు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఫ్లాప్ పడితే మరింత జాగ్రత్తగా నిలబడాలన్న ఆవేశం ఉంటుంది. ఇప్పుడు వెంకటేష్ (Venkatesh) కూడా ఇలాంటి దశలో ఉన్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తుందనేది ఆరంభంలో ఎవరూ ఊహించలేదు. కానీ, సినిమా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
వెంకటేష్ కెరీర్‌లో ఇప్పటివరకు అతిపెద్ద కలెక్షన్ సాధించిన సినిమా ఇదే. దీంతో, ఇప్పుడు వెంకీ తన తర్వాతి సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) సినిమా ముందు వెంకటేష్ ఇప్పటికే రెండు కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో ఒకటి సామజవరగమన రైటర్ చెప్పిన కథ కాగా, మరొకటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్. ఈ రెండు కథలు కూడా వెంకీకి నచ్చినప్పటికీ, సంక్రాంతి విజయంతో వెంకీ మరోసారి ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ కథలను పక్కన పెట్టి, మరింత సేఫ్ గేమ్ ఆడాలని చూస్తున్నట్లు సమాచారం. దీనికితోడు, స్టార్ డైరెక్టర్స్ కోసం వెతుకుతున్నారని టాక్. ఇటీవల సురేందర్ రెడ్డి (Surender Reddy) వెంకీ కోసం ఓ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ కథను సిద్ధం చేశారని, అయితే వెంకీ ఇప్పుడు యాక్షన్ కన్నా ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలపై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యాడట. అందుకే, యాక్షన్ డ్రామా చేయాలని సిద్ధంగా ఉన్న సురేందర్ రెడ్డి కథను వెంకీ రిజెక్ట్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక వెంకటేష్ సినిమాలకు సురేష్ బాబు ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. ఆయన అన్నగా మాత్రమే కాక, నిర్మాతగా కూడా మంచి వ్యూహాలను అమలు చేస్తుంటారు. గత కొన్నేళ్లుగా కొన్ని సినిమాల విషయంలో అంతగా జోక్యం కలగనప్పటికీ, ఇప్పుడు మళ్లీ వెంకీ కెరీర్‌ను నిశితంగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది.