టాలీవుడ్ లో ‘ఛలో’, ‘భీష్మ’ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన వెంకీ కుడుములను సైబర్ నేరగాళ్లు మోసం చేయడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. గతేడాది రిలీజైన ‘భీష్మ’ సినిమాను అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు నామినేట్ చేస్తామంటూ వెంకీ కుడుములను నమ్మించారు సైబర్ నేరగాళ్లు. ఈ క్రమంలో వెంకీ నుండి రూ.66 వేలు డిపాజిట్ చేయించుకొని మోసం చేశారు. దీంతో వెంకీ సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ కు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదైంది. ఇటీవల వెంకీకి గుర్తు తెలియని వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది.
ఆ వ్యక్తి ‘భీష్మ’ సినిమాను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆరు కేటగిరీల్లో నామినేట్ చేయాలని నిర్ణయించామని వెంకీకి చెప్పాడు. తాను ఆ ప్యానల్ లో కీలక సభ్యుడిని అని వెంకీని నమ్మించాడు. ఆ ఫెస్టివల్ లో నామినేట్ చేయడానికి ఒక్కో కేటగిరీకి రూ.11 వేలు చొప్పున ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. దీనికి అంగీకరించిన వెంకీ.. నేరగాడు పంపించిన బ్యాంక్ అకౌంట్ కి డబ్బు పంపించాడు.
మరుసటి రోజు మళ్లీ వెంకీకి ఫోన్ చేసిన నేరగాడు.. ఆరు కేటగిరీలకు సంబంధించి నామినేట్ చేసే విషయంలో చిన్న పొరపాటు జరిగిందని.. వాటిని సరిచేయడానికి మరికొంత మొత్తం చెల్లించాల్సి వస్తుందని చెప్పాడు. దీంతో వెంకీకి అనుమానం వచ్చింది. విషయం ఆరా తీయగా.. తను మోసపోయిన విషయాన్ని గ్రహించాడు. దీంతో సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేశాడు. నేరగాడు ఉపయోగించిన ఫోన్ నెంబర్లు, వెంకీ డబ్బు పంపిన అకౌంట్ వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.