హీరోను కథతో మెప్పించి… సినిమా ఓకే చేయించుకోవడం ఎంత కష్టమో… ఆ సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చి… ప్రేక్షకుల్ని మెప్పించడం అంతకంటే ఎక్కువ కష్టం. ఎందుకంటే అభిమాన కథానాయకుడు తమ అంచనాలకు తగ్గట్టుగా లేకపోతే అభిమానులు నిరాశపడతారు. దీంతో బాక్సాఫీసు డల్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ దర్శకుడు తిరిగి కోలుకోవడం కష్టమైపోతుంది. ఇలాంటి పరిస్థితుల నుండి బయటకు రావడం తెలిసిన దర్శకులు చాలా తక్కువ మందే. అందులో కుర్ర దర్శకలు అయితే ఇంకా కష్టం.
ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రాకుండా, తన సాటి వారికి, తోటి వారికి బంపర్ ఆఫర్ ఇచ్చే పని వెంకీ కుడుముల చేతుల్లో ఉంది. ఇదీ అసలు మేటర్. ఇక వివరాల్లోకి వెళ్తే…మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా వెంకీ కుడుముల చాలామందికి తెలుసు. దర్శకుడు అయ్యాక రెండు సినిమాలు ‘ఛలో’, ‘భీష్మ’తో మెప్పించాడు కూడా. ఆ తర్వాత ఇంకా ఏ సినిమా కూడా ఓకే చేయించుకోవడం లేదేంటి అని అందరూ అనుకుంటున్నారు. ఈ సమయంలో చేసే సినిమా మామూలుగా ఉండకూడదు అనుకున్నట్లుగా ఉన్నాడు.
అందుకే ఏకంగా తన అభిమాన కథానాయకుడు చిరంజీవినే డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. మంచి ఎంటర్‌టైన్మెంట్ కథతో చిరు దగ్గరకు వెళ్లిన వెంకీ… అలా కథ చెప్పి, ఇలా ఓకే చేసుకున్నాడు. ఇక దానిని పర్‌ఫెక్ట్‌గా సిద్ధం చేసుకొని, సినిమాను పట్టాలెక్కించి, అంతే చక్కగా తెరకెక్కించాలి. ఆ తర్వాత థియేటర్లలో ప్రేక్షకుల్ని మెప్పించాలి. ఇక్కడే ఉంది మెలిక. అనుభవజ్ఞులైన దర్శకులకే స్టార్ హీరోలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం లేదు. ఈ సమయంలో కుర్ర దర్శకుడికి ఇదెలా సాధ్యమవుతుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చిరంజీవి గతంలో కొంతమంది కుర్ర దర్శకులకు అవకాశాలు ఇచ్చారు. ఆ క్రమంలో సరైన ఫలితాలు దక్కలేదు. ఇప్పుడు చిరంజీవి మళ్లీ కుర్ర డైరక్టర్లకు ఛాన్స్‌లు ఇస్తున్నారు. ఈ సమయంలో వెంకీ కుడుముల ఆకట్టుకోకపోతే… పెద్ద హీరోలు కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడానికి జంకొచ్చు. కాబట్టి వెంకీ కుడుమల తన ప్రతిభనంగా చిరంజీవి సినిమాలో చూపించి మెప్పించాలి. అతను చేసిన రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్లు కావు. కానీ చిరంజీవి ఓకే చేశాడంటే ఏదో విషయం ఉండాలి. అదేంటో చూడాలి.