సినిమాల యందు వెట్రిమారన్ సినిమాలు వేరయా అంటుంటారు. తమిళనాట ఆయన తెరకెక్కించిన సినిమాలను అదిరిపోయే వసూళ్లతో లెక్కకట్టడం తప్పు అవుతుంది. మనసుల్ని పిండేసే ఎమోషన్లు, కళ్లు చెమర్చే మాటలు, చేతలతోనే లెక్క కట్టాలి. తాజాగా ఆయన నుండి మరో సినిమా వచ్చింది. ఎప్పటిలాగే సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఎంతగా అంటే.. తెలుగు జనాలు ఆ సినిమా చూసి.. మన దగ్గర డబ్బింగ్ వెర్షన్ ఇవాళో, రేపో విడుదల చేసేయండి అని డిమాండ్ చేసేంతగా. ఆ సినిమానే ‘విడుతలై – 1’.
స్టార్ హీరో ఇమేజ్ మీద ఓపెనింగ్స్ రావడం చూసుంటారు. కానీ ఒక డైరెక్టర్ ఇమేజ్ ఆధారంగా సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం ఎప్పుడైనా చూశారా. తెలుగులో అయితే ఎస్.ఎస్.రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, పూరి జగన్నాథ్ లాంటి వాళ్లు ఇలాంటి ఘనత అందుకున్నారు. అయితే వీళ్లంతా కమర్షియల్ సినిమాల కెప్టెన్లే. అయితే ప్రయోగాత్మక సినిమాలు, కాన్సెప్ట్ ఆధారిత సినిమాలు చేస్తూ.. మేం పైన చెప్పిన ఓపెనింగ్స్ అందుకోవడం వెట్రిమారన్ లాంటివారికే సాధ్యం. రా అండ్ రస్టిక్ లో సినిమాలు తీస్తారనే పేరున్న వెట్రిమారన్ మరోసారి అలాంటి సినిమాతోనే వచ్చారు.
‘విడుతలై 1’ ఈ వారం భారీ అంచనాల మధ్య విడుదలైన భారీ విజయం అందుకుంద.ఇ ప్రీమియర్స్ నుండే ప్రశంసల వర్షం కురిసినా.. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే అంశంలో అనుమానాలు ఉండగా.. తొలి టాక్ విన్నాక అవన్నీ పటాపంచలు అయిపోయాయి. కమెడియన్ సూరి కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రధారి. పోలీస్ వ్యవస్థలోని అహంకార జాడ్యం… టెర్రరిస్టులు, నక్సలైట్లను ఎదిరించే క్రమంలో పోలీసులు చేసిన దురాగతాలను సినిమాలో చర్చించిన తీరు బాగుంది అంటున్నారు.
అయితే, సినిమాలో హింస మోతాదు కాస్త ఎక్కువగానే ఉంది అంటున్నారు. అణుగారిన వర్గాల కష్టాలను చూపిస్తూ సినిమాలు చేస్తున్న వెట్రిమారన్ (Vetrimaaran) ఈ సినిమాలోనూ అదే పని చేశారు. ఆయన దర్శకత్వానికి సూరి, విజయ్ సేతుపతి నటన కలసి సరైన సినిమాగా రూపొందింది అని చెబుతున్నారు. తెలుగు డబ్బింగ్ చేసి ఏప్రిల్ 7 విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మనం కూడా త్వరలోనే ఈ సినిమాను తెలుగులో చూడొచ్చు.