ఒక సినిమా అవకాశం.. మరికొన్ని సినిమాల్లో అవకాశాలిస్తుంది అంటారు. అలాగే ఒక సినిమా ఫలితం మరికొన్ని సినిమాలు పోయేలా చేస్తుంది అంటే నమ్ముతారా? కానీ ప్రముఖ కథానాయిక విద్యా బాలన్ చెప్పేది వింటే అవునా నిజమా? ఇలా కూడా జరుగుతుందా అని ముక్కున వేలేసుకుంటారు. ‘పరిణీత’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సౌత్ భామ విద్యా బాలన్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు సిల్క్ స్మిత జీవిత కథ స్ఫూర్తితో రూపొందిన ‘డర్టీ పిక్చర్’ సినిమాతో మరింతగా ప్రేక్షకులకు చేరువైంది.
అయితే, ఆమె తొలి రోజుల్లో చాలా ఇబ్బందులు పడింది. బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి ముందే దక్షిణాదిలో చేసిన ఓ సినిమా మధ్యలో ఆగిపోవడంతో ఏకంగా తొమ్మిది సినిమాల నుండి తనను తీసేశారని విద్యా బాలన్ చెప్పుకొచ్చింది. అంతే కాదు తనపై ఐరెన్ లెగ్ అనే ముద్ర కూడా వేశారు అని బాధపడింది. మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్ సినిమా ‘చక్రం’ కారణంగానే ఇదంతా జరిగిందట. ఆ సినిమా అనౌన్స్ అవ్వగానే విద్యా బాలన్‌కు ఇతర పరిశ్రమల నుండి కూడా అవకాశాలు వచ్చాయట.
అయితే ‘చక్రం’ సినిమా వివిధ కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. అంతేకాదు ఆ సినిమా ఆగిపోవడానికి విద్యనే కారణమంటూ ప్రచారం కూడా జరిగింది. దాంతో సినిమా పరిశ్రమలో ఆమెను ‘ఐరెన్ లెగ్’ అని అన్నారట. ఆ ఎఫెక్ట్‌తో ఆమె ఒప్పుకున్న ఇతర తొమ్మిది ప్రాజెక్ట్‌ల నుండి తొలగించారట. అయితే ఆ సినిమా ఆగిపోవడానికి కారణం మోహన్ లాల్, ఆ చిత్ర దర్శకుడికి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలు. ఆ విషయం తెలియక అందరూ తనను అనుకున్నారని.. దాంతో సినిమాల నుండి పక్కన పెట్టారని విద్య చెప్పుకొచ్చింది.
ఇక విద్యా బాలన్ తెలుగులో కూడా నటించారు. బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటించిన ‘యన్టీఆర్’ సినిమాల్లో బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటించింది. ఇప్పుడు ఆమె మరోసారి బాలకృష్ణతో నటిస్తోంది అని సమాచారం.