బాలీవుడ్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రెస్స్ అంటే విద్యాబాలన్ పేరే చెప్పాలి. ‘డర్టీ పిక్చర్’ చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది విద్యాబాలన్. ‘సిల్క్ స్మిత’ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో.. విద్యాబాలన్ చాలా బోల్డ్ గా నటించింది. అయితే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీగా అయితే జరగలేదట.. ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇవ్వకముందు ఆమె ఎన్నో కష్టాలు పడుతూ వచ్చింది. దాదాపు 3 ఏళ్ళ వరకూ ఆఫీసులు చుట్టూ తెగ తిరిగిందట. ఈ విషయాల్ని స్వయంగా విద్య బాలన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. విద్య బాలీవుడ్‌తో పాటు పలు దక్షిణాది భాషా చిత్రాల్లో కూడా నటించింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న ‘మిషన్ మంగళ్’ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో విద్యా బాలన్ తో పాటు తాప్సీ, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్, కృతి కుల్హారీ… ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కాబోతుంది.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విద్య మాట్లాడుతూ.. “మాది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కాకపోవడంతో సినిమాల్లోకి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాను. ఎలా రావాలో కూడా తెలిసేది కాదు. నా కుటుంబం కూడా ఈ విషయంలో చాలా ఇబ్బంది పడింది. కానీ వారి మద్దతు, ప్రోత్సాహం వల్ల ఎలాగో అడుగుపెట్టగలిగాను. మొదటిసారి టీవీ షోలో చేశాను. తర్వాత అది ఆగిపోయింది. ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కానీ, సినిమాల్లోకి రావాలన్న కలను మాత్రం వదిలిపెట్టలేదు. మూడేళ్ళపాటు కొన్ని కార్యాలయాల చుట్టూ తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా నన్ను రిజెక్ట్ చేస్తూ వచ్చేవారు. ఓ సారయితే మూడు రోజుల పాటు నిద్రకూడా పట్టలేదు. ఏడుస్తూనే ఉన్నాను. కానీ తర్వాత నాకు నేను విశ్వాసం కూడగట్టుకుని మళ్ళీ ప్రయత్నించేదాన్ని. భవిష్యత్తు మీద ఆశ ఉంది కాబట్టే నా కలను వదులుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చింది.