‘ఫ్యామిలీ స్టార్’ (The Family Star) సినిమా డిస్ట్రబెన్స్ నుండి బయటికొచ్చి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కొత్త సినిమాలు వరుస పెట్టి చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ కూడా అదే పనిలో ఉన్నాడు అని అర్థమవుతోంది. అందుకే గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) సినిమా తర్వాత విజయ్ మరో రెండు సినిమాల కథలకు పచ్చ జెండా ఊపాడు అని అంటున్నారు. అందులో ఒకటి సెకండ్ టైమ్ కొలాబరేషన్ కాగా, మరొకటి యువ దర్శకుడితో. ఈ పుకార్లు కథ వరకే కాదు సినిమా టైటిల్ వరకు కూడా వచ్చాయి.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌కి రెడీ అవుతోంది. పాటలు ఉండవు అని చెబుతున్న ఈ సినిమా సంగతి కాసేపు పక్కన పెడితే.. కొత్తగా విజయ్ రెండు సినిమాలు ఓకే చేశాడట. ‘రాజావారు రాణీగారు’ సినిమా ఫేమ్ రవికిరణ్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందట. దిల్ రాజు (Dil Raju) ఈ సినిమాకు నిర్మాత అంటున్నారు. ఈ సినిమాకే ‘రౌడీ జనార్దన్’ అనే పేరు ఫిక్స్ చేశారట.
ఈ సినిమాతోపాటు రాహుల్ సాంకృత్యాన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో మరో సినిమాకు విజయ్ ఓకే అన్నాడట. ‘టాక్సీవాలా’ (Taxiwaala) సినిమాతో ఇద్దరూ గతంలో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగుతుందట. ఈ సినిమా కోసం విజయ్ తొలిసారి సీమ యాసలో డైలాగ్‌లు చెబుతాడట. మే 9న విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు చిత్రాల్ని ప్రకటిస్తారట.
ఈ రెండు సినిమాల విషయంలో మరో చర్చ కూడా ఉంది. రాహుల్ సాంకృత్యాన్ గతంలో నందమూరి మోక్షజ్ఞ కోసం ఓ కథ రాశారని, వినిపించారని అప్పట్లో వార్తలొచ్చాయి. రాయలసీమ నేపథ్యంలోనే ఈ సినిమా ఉంటుంది అన్నారు. దీంతో ఆ కథతోనే విజయ్ సినిమా చేస్తున్నాడా? అనే ప్రశ్న వినిపిస్తోంది. అలాగే ‘రౌడీ జనార్దన్’ టైటిల్ ఏదో డబ్బింగ్ సినిమా టైటిల్‌లా ఉంది అనే చర్చ కూడా సాగుతోంది.