జాతీయ అవార్డు వస్తే.. అంతకుమించిన గౌరవం, ఆనందం మరొకటి లేదు అనే హీరోలు ఉన్న రోజులివి. ‘నేను జాతీయ ఉత్తమ నటుడిని.. ’ అంటూ గర్వంగా, సగర్వంగా చెప్పుకుంటున్న రోజులివి. అలాంటిది ఆ అవార్డు వస్తే డస్ట్‌బిన్‌లో పడేస్తా అంటున్నాడు ఓ హీరో. ఒకవేళ ఆ అవార్డు బంగారం అయితే అమ్మేస్తా..’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతటి కామెంట్స్ చేసిన హీరో ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు మన విశాల్. ఓ పాడ్‌కాస్ట్‌లో ఇటీవల మాట్లాడిన ఆయన ఈ కామెంట్స్ చేశాడు.
తన కెరీర్‌లో సవాలు విసిరిన పాత్ర అంటే ‘అవన్- ఇవన్’ (తెలుగులో ‘వాడు – వీడు’) సినిమాలో చేసిన వాల్టేరు పాత్రే అని చెప్పాడు విశాల్. బాలా తెరకెక్కించిన ఈ సినిమాలో ఆర్య మరో హీరో కాగా.. 2011లో విడుదలైందీ చిత్రం. అయితే ఆ పాత్రను ఇప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా మళ్లీ చేసే ప్రసక్తే లేదని చెప్పాడు. ఎందుకంటే వాల్టేర్ రోల్ కోసం శారీరకంగా, మానసికంగా విశాల్ చాలా శ్రమపడ్డాడు. ఆ సినిమా విశాల్ కెరీర్‌కి, టాలెంట్‌కి ఓ గీటురాయి అని చెప్పాలి.
ఇక అవార్డుల గురించి మాట్లాడుతూ.. వాటిపై తనకు నమ్మకం లేదని క్లారిటీ ఇచ్చేశాడు. జాతీయ పురస్కారాలు, ఇతర అవార్డులు.. వేటినీ నమ్మను. జ్యూరీలో ఉండే కొద్దిమంది బెస్ట్ యాక్టర్, బెస్ట్ మూవీ, బెస్ట్ హీరోయిన్ అంటూ ఎలా డిసైడ్ చేస్తారు?. వీటి కోసం సర్వే నిర్వహించి ప్రేక్షకుల అభిప్రాయాలు సేకరించాలి. అప్పుడు ఆ అవార్డులను నమ్మొచ్చు. అలా అని నాకు అవార్డు రాలేదని నేను ఈ మాట మాట్లాడటం లేదు. నాకు అవార్డు వచ్చినా దాన్ని డస్ట్‌బిన్‌లో పడేసా. ఒకవేళ బంగారం చేసినట్లయితే దాన్ని అమ్మేసి, వచ్చిన డబ్బును విరాళంగా ఇచ్చేస్తా అని చెప్పాడు విశాల్.
ఇక విశాల్ ప్రజెంట్ సినిమాల సంగతి చూస్తే.. ‘మకుటం’, ‘తుప్పరివాలన్ 2’ (డిటెక్టివ్ 2) సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇవిలా ఉండగా సుందర్. సి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారని సమాచారం. వారి పాత చిత్రం ‘మదగజరాజా’ లేట్ రిలీజ్ అయి మంచి విజయాన్నే అందుకుంది.