ఎంతమంది పోటీ పడినా… అవార్డు ఒకరికే వస్తుంది. కాబట్టి పోటీ పోటీనే, ఫలితం వచ్చాక పని పనే. అంతేకానీ ఆ విషయాన్నే పట్టుకుని బాధపడితే ముందుకెళ్లలేం. ఏంటీ వేదాంతం అనుకుంటున్నారా? మామూలుగా అయితే ఈ మాటలు ఇప్పుడు చెప్పక్కర్లేదు. కానీ ఇటీవల తమిళ స్టార్ హీరో విశాల్ చేసిన కొన్ని కామెంట్లు చూశాక ఈ మాటలు చెప్పాల్సి వచ్చింది. అంతగా ఏమన్నాడు అనుకుంటున్నారా? అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా అని ఏదో కామెంట్స్ చేశాడు లెండి. దీంతో విశాల్ ఇలా ఎందుకు మాట్లాడాడు అనే ప్రశ్న మొదలైంది.
ముందు విశాల్ ఏమన్నాడో చూసి… ఆ తర్వాత అలా ఎందుకు అన్నాడో ఆలోచిద్దాం. అవార్డులను నేను నమ్మను, అసలు పట్టించుకోను కూడా. ఒక సినిమాకు, ఒక నటుడికి ప్రేక్షకులు ఇచ్చే గుర్తింపే నాకు అసలైన అవార్డు అని విశాల్ చెప్పాడు. అక్కడితో ఆగకుండా ఒకవేళ ఒక సినిమాలో తన నటనకు గాను అవార్డు ఇచ్చినా దాన్ని చెత్త బుట్టలో పడేస్తానని కాస్త ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఈ మాటలే వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్యే జాతీయ అవార్డుల ప్రకటన జరిగింది కాబట్టి.
ఇటీవల ప్రకటించిన జాతీయ పురస్కారాల్లలో టాలీవుడ్ ఆధిపత్యం కనిపించింది. ఈ క్రమంలో తమిళంలో మంచి విజయం అందుకున్న సినిమాల విషయంలో చిన్నచూపు చూశారనే కామెంట్లు కూడా వినిపించాయి. ఇప్పుడు విశాల్ అవార్డుల గురించి ఇలా అనడంతో తమిళ సినిమాలకు అవార్డులు రాలేదనే ఇలా అన్నాడు అంటూ ఓ వర్గం అంటున్నారు. మరికొందరు అయితే ఆయన ఏదో అవార్డుల ప్రస్తావన వచ్చి అలా అన్నాడు అని అంటున్నారు. ఆయన మనసులో ఏముందో కానీ చర్చ అయితే ఇలా మారింది.
తెలుగు సినిమా ఇటీవల కాలంలో జాతీయ గుర్తింపే కాదు, ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాఓలని ‘నాటు నాటు..’ పాటకు ఆస్కార్ కూడా దక్కింది. ఈ సమయంలో తమిళనాట నుండి సరైన స్పందన రాకపోగా… ఇప్పుడు విశాల్ ఇలా అవార్డుల గురించి అనడమే డిస్కషన్‌కి కారణం.