చిన్న సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకుంటాయని నటుడు విశ్వక్ సేన్ అన్నారు. ఇప్పటికే ఈ విషయం ఎన్నోసార్లు రుజువైందని చెప్పారు. నవీన్ బేతిగంటి కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ‘రామన్న యూత్’. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు నటుడు విశ్వక్‌సేన్ అతిథిగా వెళ్లారు. అక్కడ ఆయన మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘చరిత్ర సృష్టించడానికి బడ్జెట్‌తో పనిలేదని ఇప్పటికి చాలా సార్లు రుజువైంది. ‘పెళ్లిచూపులు’, ‘ఫలక్‌నుమా దాస్’, ‘బలగం’..
ఇలా చాలా సినిమాలు చిన్నవిగా విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. బడ్జెట్ మాత్రమే కాదు.. సినిమా కోసం దాని వెనకాల చాలా మంది కష్టపడుతుంటారు. వాళ్ల కష్టానికి లెక్కకడితే ఏ బడ్జెట్ సరిపోదని నాకు అనిపిస్తుంటుంది. ఇక సినిమా టికెట్‌పై నేను నటించిన చిత్రం పేరు చూసుకోవాలని కోరిక ఉండేది. ఆ కోరిక ‘ఈ నగరానికి ఏమైంది’తో తీరింది. వంద టికెట్లు ఒకేసారి కొని చూసుకున్నాను’ (Vishwak Sen) అని అన్నారు.
ఇక ‘రామన్నా యూత్’ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘యువతలో ఎక్కువ మంది క్రికెట్, రాజకీయాలపై ఆసక్తి చూపుతుంటారు. అదే పాయింట్‌తో ఈ చిత్రం రూపొందింది. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో మహిళలు కూడా ఉన్నారని తెలుస్తోంది. అది ఎంతో హర్షించదగ్గ విషయం’ అని చెప్పారు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్15న ప్రేక్షకుల ముందుకు రానుంది.