సాధారణంగా ఒక భారీ సినిమా బోల్తా కొడితే, డిస్ట్రిబ్యూటర్లు రోడ్డున పడ్డారనే వార్తలు షికారు చేయడం కామన్. ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో వచ్చిన ‘వార్ 2’ విషయంలోనూ ఇదే జరిగింది. తెలుగు హక్కులు తీసుకున్న నాగవంశీకి కోట్లలో నష్టం వచ్చిందని సోషల్ మీడియా కోడై కూసింది. కానీ పైకి కనిపిస్తున్న నష్టానికి, లోపల జరిగిన సెటిల్మెంట్ కు పొంతన లేదని వంశీ బయటపెట్టిన లెక్కలతో తేలిపోయింది.
War 2
నిజానికి బిజినెస్ పరంగా చూస్తే వంశీకి దెబ్బ పడిన మాట వాస్తవమే. రూ. 68 కోట్లు (జీఎస్టీ కాకుండా) పెట్టి హక్కులు కొంటే, బాక్సాఫీస్ దగ్గర వెనక్కి వచ్చింది కేవలం 35 నుంచి 40 కోట్లు మాత్రమే. అంటే దాదాపు సగం పెట్టుబడి ఆవిరైపోయింది. మామూలుగా అయితే ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా ఈ దెబ్బకు విలవిలలాడిపోవాలి. కానీ ఇక్కడే బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) తమ నిజాయితీని చాటుకుంది.
వ్యాపారం అంటే కేవలం లాభాలే కాదు, నష్టాల్లోనూ తోడుండాలని నిరూపిస్తూ, వాళ్ళు వంశీకి ఏకంగా రూ. 18 కోట్లు వెనక్కి ఇచ్చేశారు. ఎలాంటి గొడవలు లేకుండా, సినిమా ఫెయిల్ అయ్యిందనే బాధ్యతతో వాళ్ళు చేసిన ఈ పని ఇప్పుడు ఇండస్ట్రీకి ఒక కేస్ స్టడీ. ఈ భారీ రీఫండ్ తో వంశీ నెత్తి మీద ఉన్న భారం గణనీయంగా తగ్గిపోయింది.
బయట ప్రచారం జరుగుతున్నట్లు 30-40 కోట్ల నష్టం అనేది అబద్ధమని, తనకు జరిగిన వాస్తవ నష్టం రూ. 10 నుంచి 15 కోట్ల మధ్యలోనే ఉంటుందని వంశీ క్లారిటీ ఇచ్చారు. సినిమా పోయినా, ఇలాంటి సపోర్ట్ దొరకడం వల్లే తాను సేఫ్ అయ్యానని ఆయన మాటల్లో అర్థమవుతోంది. మొత్తానికి డిజాస్టర్ టాక్ వచ్చినా, ఈ ‘మ్యూచువల్ అండర్ స్టాండింగ్’ వల్ల నిర్మాత గట్టెక్కగలిగారు.