సుమారు రెండేళ్ల క్రితం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరిగినప్పుడు.. ముఖ్యంగా వినిపించిన టాపిక్. ‘‘మా’కు సొంత బిల్డింగ్’. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానల్ చుట్టూ తిరిగిన ఈ ఎన్నికల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ అంటే ‘మా భవనం’ అనే చెప్పాలి. అయితే విష్ణు ప్యానల్ టైమ్‌లో ఇంకా చెప్పాలంటే ఆరు నెలలు మాత్రమే ఉంది. దీంతో ‘మా భవనం ఏమైంది’ అనే చర్చ వినిపిస్తోంది. అసలు భవనం కడతారా? లేదా? ఎందుకు కట్టరు? ఎందుకు కట్టాలి? అవసరం ఏంటి? లేకపోతేంటి? అనే చర్చలు వినిపిస్తున్నాయి.
‘మా’ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సాధారణ ఎన్నికల స్థాయిలో వాడివేడిగా ఉంటాయి. గతసారి కూడా ఇదే జరిగింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. టీవీలకు ఎక్కడాలు.. నానా రభస.. ఏడుపులు పెడబొబ్బలు చాలానే కనిపించాయి. ఎన్నికలు రోజు, కౌంటింగ్ రోజు అయితే అవి పీక్స్‌కి వెళ్లాయి. కొరుక్కోవడాలు, అరుచుకోవడాలు.. ఇలా ఒక్కటా రెండా చాలానే చూశాం. అయితే ఇంత కష్టపడి ఎన్నికలు జరిపి.. ఒక ప్యానెల్ గెలిచాక ప్రధానాంశాన్ని పక్కన పెట్టేశారు. అదే ‘మా’ బిల్డింగ్.
అత్యాధునిక హంగులతో ‘మా బిల్డింగ్’ నిర్మిస్తానని మాట ఇచ్చి ఎన్నికల్లో గెలిచాడు విష్ణు. దీని కోసం ప్లేస్ చూశాను, కట్టడానికి అంతా రెడీ.. డబ్బులు మా ఫ్యామిలీనే ఇస్తాది అని కూడా చెప్పారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదు. అయితే ‘మా’ బిల్డింగ్ విషయంలో సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవ్వడమే దీనికి కారణం అని అంటున్నారు. కొంతమంది ‘మా భవనం’ కట్టాల్సిందే అని అంటుంటే.. మరికొంతమంది ‘మా బిల్డింగ్’ అవసరం లేదని అంటున్నారట.
(MAA ) బిల్డింగ్‌కి పెట్టే డబ్బులతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అంటున్నారు. ఈ బిల్డింగ్ కట్టినా సభ్యులు పెద్దగా వచ్చేది లేదని, అలాంటప్పుడు అంత డబ్బులు వెచ్చించడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారట. దీంతో ‘మా బిల్డింగ్’ విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారని తెలుస్తోంది. దీంతో వచ్చే ‘మా’ ఎన్నికల్లో ‘మా బిల్డింగ్’ సీక్వెల్ చూస్తాం అని అనుకోవచ్చు.