టెలివిజన్ చరిత్రలో అతి పెద్ద రియాలిటీ షోగా ‘బిగ్‌బాస్’కి పేరు. నాలుగు సీజన్లుగా తెలుగులో నడిచిన బిగ్‌బాస్‌కు మంచి టీఆర్పీ కూడా వస్తుంటుంది. స్టార్లను తీసుకొచ్చి ఎప్పటికప్పుడు షో రేటింగ్స్‌ను హైలో ఉంచుతారు. అయితే ఇదంతా చేయాలి అంటే… ముందు ఆ ఇంట్లోకి వెళ్లడానికి సెలబ్రిటీలు/ సెలబ్రిటీలు లాంటి వాళ్లు ముందుకు రావాలి. లోపల ఎవరూ లేకపోతే, ఉన్నవాళ్లు ప్రజలకు కాస్త తెలిసిన ముఖాలు కాకపోతే షో ఎంత గ్రాండ్‌గా పెట్టి ఏం లాభం. ఐదో సీజన్‌కు వచ్చేసరికి పరిస్థితి ఇలానే ఉందంటున్నాయి టీవీ వర్గాలు.
కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు కాస్త సద్దుమణగడంతో ‘బిగ్‌బాస్’ షో ఐదో సీజన్‌ను స్టార్ట్ చేయాలని టీం భావిస్తోంది. దీనికి సంబంధించి అన్నపూర్ణ స్టూడియోస్‌లో సెట్ పనులు ప్రారంభించారని కూడా వార్తలొచ్చాయి. అయితే ఇల్లు రెడీ అవుతున్నా, ఇంట్లోకి వెళ్లడానికి మనుషులు రెడీగా లేరని అంటున్నారు. బిగ్‌బాస్ హౌస్ అనగానే చాలామంది ముఖం చాటేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కారణాలు ఎన్ని చెబుతున్నా… ఫైనల్ ఆ షో వల్ల తమకొరిగేదేం ఉండదు అని అనుకోవడమే అసలు కారణమట.
బిగ్‌బాస్‌లో ఇప్పటివరకు నాలుగు సీజన్లు అయ్యాయి. అందులో గెలిచిన వారికి తర్వాత భారీ ఫేమ్ వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అనుకున్నంత స్థాయిలో కనిపించలేదు. ఒకరిద్దరు పరిస్థితి బాగుందని చెప్పొచ్చు. ఇక ఇంట్లో 100 రోజులు ఉండకుండా బయటకు వచ్చినవారి పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంటోంది. దీంతో ఆ ఇంట్లోకి వెళ్లి, ఉన్న ఫేమ్‌ను ఇరుకున పెట్టడం అవసరమా అని కొంతమంది భావిస్తున్నారట.
ఇంకొందరైతే టీవీ, సినిమాలు, సోషల్ మీడియాలో వరుస అవకాశాలు వస్తున్నప్పుడు.. వదిలి వెళ్లాలా అనేది ఆలోచిస్తున్నారట. దీంతో ఈసారి బిగ్‌బాస్ అనుకున్న సమయానికి మొదలవుతుందా అనేది చూడాలి. అనుకున్న సయమం అంటే… జులై అని ఒక టాక్. ఈసారి ఇంట్లోకి వెళ్తారు అంటూ చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఏది నిజమో, కాదో తెలియడం లేదు. అయితే ఈసారి సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లను ఎక్కువగా తీసుకుంటారని మరో టాక్.