చిరంజీవి సినిమాల ఆర్డర్ విషయంలో చాలా లెక్కలు ఉన్నాయి. అయితే రీఎంట్రీ నుండి ఆయన సినిమాల కౌంట్ ఇబ్బంది లేకుండా సాగుతోంది. అయితే 157వ సినిమా దగ్గరకు వచ్చేసరికి ఏదో తెలియని ఇబ్బంది వస్తోంది. ఆ నెంబరుతో అనుకున్న సినిమా చేతులు మారుతోంది, కథ మారుతోంది, తేదీలు మారుతోంది.. ఇవన్నీ క్లియర్ అయ్యి అనుకున్నట్లుగా అంతా సాగుతోంది అనగా.. ఇప్పుడు ఆ నెంబరు వేరే సినిమాకు వెళ్లిపోయింది. అధికారికంగా మారుస్తారో లేదో కానీ.. సినిమాల వరుస అయితే మారిపోయింది.
Mega 157
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు 157 నెంబరు కేటాయించారు. #MEGA157 పేరుతో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. వెంకీ కుడుముల – డీవీవీ దానయ్య సినిమాను తొలుత 157వ సినిమాగా నిర్ణయించి అనౌన్స్ చేశారు. వివిధ కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆలోచన ముందుకెళ్లలేదు. ఈ లోపు ‘బింబిసార’ వశిష్ట వచ్చారు. ‘విశ్వంభర’ కథ ఓకే అవ్వడంతో దానికి ఆ 157 నెంబరు ఇచ్చేశారు. మధ్యలో 156వ సినిమా వచ్చిన కల్యాణ్‌కృష్ణ సినిమా అనౌన్స్‌మెంట్ దశలోనే ఆగిపోవడంతో ‘విశ్వంభర’కు 156 నెంబరు ఇచ్చేశారు.
ఇప్పుడు ఈ సినిమాను వచ్చే వేసవికి సినిమా వెళ్లిపోవడంతో దీనికి 157 వచ్చినట్లు అయింది. ఇన్నాళ్లూ ఆ స్థానంలో ఉన్న అనిల్ రావిపూడి సినిమాకు 156 వచ్చేసింది. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రావడం పక్కా అంటున్నారు. దీంతో నానా కష్టాలు పడుతున్న ‘విశ్వంభర’ సినిమా చిరంజీవిని, చిరంజీవి ఫ్యాన్స్‌ని ఇబ్బందిపెడుతున్న నెంబరులోకి వచ్చింది. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఎందుకు సినిమా ఆర్డర్ మారింది అనడానికి కూడా కొన్ని లెక్కలు వినిపిస్తున్నాయి.
‘విశ్వంభర’ సినిమా విషయంలో టీమ్ ఇంకా పూర్తి స్థాయి నమ్మకంలోకి రావడం లేదట. అనిల్ రావిపూడి సినిమాకు ముందు ఇది వచ్చి హీరో మార్కెట్ ఇబ్బందుల్లోకి వెళ్లకూడదు అని ఈ ఏడాది నుండి తప్పించారు అని అంటున్నారు. మరి మెగాస్టార్ మనసులో ఏముందో తెలియాల్సి ఉంది.