Satluj: ‘సత్లుజ్’ పంచాయితీ.. అసలు ఏంటా కథ? ఎవరా వ్యక్తి? ఏం జరిగింది?
- July 7, 2026 / 08:10 PM ISTByFilmy Focus Desk
గత రెండు రోజులుగా ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఎక్కువగా చర్చించుకుంటున్న అంశం ‘సత్లుజ్’. ప్రముఖ నటుడు, గాయకుడు దిల్జీత్ సింగ్ దొసాంజ్ ప్రధాన పాత్రలో రూపొంది.. వివిధ కారణాల వల్ల మూడు నాలుగేళ్లు సెన్సార్ దగ్గర ఆగిపోయిన సినిమా అది. ఇటీవల ఓటీటీలోకి వస్తే రెండు రోజుల్లో డిలీట్ చేసేశారు. ఇంత చర్చకు కారణమైన ‘సత్లుజ్’ సినిమా కథేంటి, ఆ మెయిన్ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ ఏంటో చూద్దామా?
Satluj
పంజాబ్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త ‘జస్వంత్ సింగ్ ఖాల్‌ఢా’ జీవితం ఆధారంగా ‘సత్లుజ్’ సినిమాను తెరకెక్కించారు. పంజాబ్ అమృత్‌సర్‌కి చెందిన జస్వంత్ సింగ్ ఖాల్‌ఢా బ్యాంక్ ఉద్యోగిగా వృత్తి జీవితాన్ని మొదలుపెట్టారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అందరికీ అందాలని బలంగా నమ్మే వ్యక్తి. దాంతో మానవ హక్కుల కార్యకర్తగా మారారు. ఆయనపై ఆపరేషన్ బ్లూస్టార్, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు తీవ్ర ప్రభావం చూపించాయి.
ఉగ్రవాద సంస్థలతో ఆయనకు సంబంధాలున్నాయంటూ తమ బంధువులను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చాలామంది ఆరోపణలు చేశారు. పోలీసులు తీసుకెళ్లిన వ్యక్తుల ఆచూకీ కోసం పోరాడారు. తన చుట్టూ ఉన్న ఒక్కొక్కరు అదృశ్యం కావడంపై జస్వంత్ సింగ్ కలత చెందారు. వారికి ఏమైందంటూ ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఆ క్రమంలో అమృత్‌సర్ మున్సిపల్ రికార్డులను పరిశీలించగా పోలీసులు వారిని హత్యచేసి, కుటుంబాలకు చెప్పకుండా దహనం చేశారని గుర్తించారట.

ఈ విషయం అలా అలా బయటకు పొక్కడంతో దేశీయ, అంతర్జాతీయ మీడియాలు ఈ విషయంపై దృష్టిపెట్టాయి. అయితే 1995లో ఆయనే అకస్మాత్తుగా కనిపించకుండాపోయారు. పంజాబ్ పోలీసులే తీసుకెళ్లారనే ఆరోపణలు వచ్చాయి. అప్పటి శిరోమణి అకాలీదళ్ సీనియర్ నాయకుడు గురుచరణ్ సింగ్ వోహ్రా ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సందేశం పంపారు. ఆ టెలిగ్రామ్‌ను సుప్రీం కోర్టు హెబియస్ కార్పస్ పిటిషన్‌గా తీసుకుంది. వారంలోగా స్పందించాలని పంజాబ్ పోలీసులను ఆదేశించింది.
జస్వంత్ భార్య పరమ్‌జీత్ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. జస్వంత్ సింగ్ హత్యకు గురైనట్లు తేల్చింది. మరణించడానికి ముందు ఆయన్ను కొన్ని రోజులు పోలీస్ స్టేషన్‌లో బంధించినట్లు ఆధారాలున్నాయని తెలిపింది. విచారణ తర్వాత 2007లో పంజాబ్, హరియాణా హైకోర్టు తీర్పు వెలువరించింది. జస్వంత్ మృతికి కారణమైనవారిలో ఐదుగురికి జీవితఖైదు విధించారు. ఆ తర్వాత కేసు సుప్రీంకోర్టుకు వెళ్లగా కింది కోర్టు తీర్పును సమర్థించంది.















