తమ హీరో నుండి ఏడాదికి రెండు, మూడు సినిమాలు రావాలి అని ప్రతి ఫ్యాన్ కోరుకుంటాడు. ఏడాది రెండు మూడుసార్లు థియేటర్లకు వెళ్లి ఈలలు, గోలలు చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. అయితే ట్రాక్ రికార్డు గురించి బాగా తెలిసిన ఫ్యాన్స్ మాత్రం ‘వద్దు బాబోయ్ వద్దు.. ఒక్క సినిమానే చాలు’ అని అంటుంటారు. ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఇలానే అనుకుంటున్నారు. దానికి కారణం వచ్చే ఏడాది మెగాస్టార్ నుండి రెండు సినిమాలు వస్తాయని చర్చ నడుస్తోంది. వీలైతే మూడు సినిమాలు కూడా రావొచ్చు అనే చర్చ ఒకటి నడుస్తోంది.
2026లో చిరంజీవి నుండి ఒకటికి మించి సినిమాలు రిలీజ్ అవుతాయనే విషయం పాతదే. కొన్ని రోజుల క్రితం ‘విశ్వంభర’ సినిమాను సమ్మర్‌లో తీసుకొస్తామని చిరంజీవి ఓ వీడియో ద్వారా తెలియజేశారు. ఇక ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సంక్రాంతికి వస్తారని సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి టీమ్ చెబుతూనే ఉంది. ఇంకా రిలీజ్ డేట్ చెప్పలేదు కానీ సంక్రాంతికి అయితే రావడం పక్కా. అంటే వచ్చే ఏడాది రెండు సినిమాలు పక్కా. ఇక కొత్తగా వచ్చిన చర్చ.. మూడో సినిమా.

‘విశ్వంభర’ చిత్రీకరణ పనులు ఇప్పటికే పూర్తి చేసుకున్న చిరు.. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యేంతవరకు రిలీజ్ కోసం ఆగుతారు. అయితే ఈ లోపు కేఎస్ రవీంద్ర (బాబీ) డైరక్షన్‌లో సినిమాను ప్రారంభించేస్తారట. ఈ సినిమా అనుకున్నట్లుగా పూర్తయితే 2026 ఆఖరులో రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఆ సినిమా పూర్తి యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉండబోతోందట. అందుకే త్వరగా పూర్తయ్యే అవకాశం లేదంటున్నారు. అలా జరిగితే 2027 పొంగల్ టార్గెట్ అవ్వొచ్చు.

ఇక అసలు విషయానికొస్తే.. రీసెంట్ టైమ్‌లో ఒకే సంవత్సరంలో చిరంజీవి రెండు సినిమాలు రిలీజైంది 2005లో. ‘అందరివాడు’, ‘జై చిరంజీవ’ అప్పుడు వచ్చాయి. రెండూ ఇబ్బందికర ఫలితాన్నే అందుకున్నారు. ఇక మూడు సినిమాలు రిలీజైంది 2001లో. అప్పుడు ‘మృగరాజు’, ‘శ్రీ మంజునాథ’, ‘డాడీ’ వచ్చాయి. తొలి సినిమా తప్ప మిగిలిన రెండూ ఫర్వాలేదనిపించాయి. ఇప్పుడు అర్థమైందిగా ఒకటికి మించి సినిమాలు ఒకే ఏడాదిలో వస్తే పరిస్థితి ఏంటా అనేది. ఏంటీ ఇది కూడా సెంటిమెంటా అంటారా. టాలీవుడ్‌లో ఇలాంటి క్రింజ్ సెంటిమెంట్లు చాలానే ఉన్నాయి మరి.
