దేశంలో తెరకెక్కుతున్న, తెరకెక్కిన అతి పెద్ద సినిమాల లిస్ట్ రాస్తే అందులో వచ్చే తొలి పేరు ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD). ప్రభాస్ (Prabhas) – కమల్ హాసన్ (Kamal Haasan) – నాగ్ అశ్విన్ (Nag Ashwin) – దీపిక పడుకొణె (Deepika Padukone) – అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కలయికలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను మే 9న రిలీజ్ చేస్తామని టీమ్ ఇప్పటికే ప్రకటించింది. అయితే అనుకున్న సమయానికి సినిమా రావడం కష్టమని టీమ్ సిట్యువేషన్ చూస్తుంటే అలా అనిపించడం లేదు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ ప్రచారం ఎలా అనేది ప్రశ్నగా మారింది.
సినిమాలో ప్రధాన తారగణంలో అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొణె ఈ సినిమాలో ప్రమోషన్స్‌లో పాల్గొంటారా? లేదా? అనే ప్రశ్న మొదలైంది. మామూలుగా అయితే సౌత్‌లో సినిమా ప్రచారానికి ఎలాంటి ఇబ్బంది లేదు. తెలుగులో ఎలాగూ ప్రభాస్, నాగీ ఉన్నారు. అందుకుతోడు ఇక్కడ ప్రచారం కోసం టీమ్ పెద్దగా ఆలోచించకపోవచ్చు. ఇతర రాష్ట్రాలు అంటే తమిళనాడు వరకు కమల్ హాసన్ లీడ్ చేస్తారు. మిగిలిన చోట్ల నిర్మాణ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయట. అక్కడ రిలీజ్ చేసే సంస్థలు చూసుకుంటాయి.
అయితే హిందీ వరకు వచ్చేసరికి కేవలం రానా (Rana) మీదే ఆధార పడే పరిస్థితి వచ్చింది అంటున్నారు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఎప్పుడు కోలుకుంటారు, తిరిగి వర్క్ మోడ్‌లోకి ఎప్పుడు వస్తారు అనేది తెలియడం లేదు. ఈ నేపథ్యంలో దీపికా పడుకొణె మీద భారం పడుతుంది. అయితే ఆమె గర్భవతి. దీంతో ఆమె ప్రచారం కోసం బయటకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. దీంతో ‘కల్కి’ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. దిశా పటానీ కూడా ఉన్నప్పటికీ… ఆమె మీద అంత భారం వేయలేరు.
ఈ నేపథ్యంలో సినిమా బాలీవుడ్ ప్రచార భారం ప్రభాస్, రానా మీద పడింది అంటున్నారు. రానాకి అయితే ఇలాంటివి పెద్ద కొత్తేం కాదు. గతంలో కామిక్‌కాన్ కోసం అక్కడ సినిమా ప్రచారాన్ని రానానే హ్యాండిల్ చేశాడు.