మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరిగినప్పుడల్లా చర్చకు వచ్చే పాయింట్ ‘సొంత భవనం’. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ‘మా’కు అద్భుతమైన సొంత భవనం కట్టిస్తాం అని అంటుంటారు. అయితే ఎన్నికలు అయ్యాక దాని గురించి పట్టించుకోవడం లేదు. ఈ విషయం గురించి గతంలో మనం చాలాసార్లు చర్చించుకున్నాం. అయితే ఈ రోజు టాపిక్ ఏంటంటే… అసలు ‘మా’ భవనం కట్టడానికి కార్యవర్గమే ముందుకు రావాలా? టాలీవుడ్‌లో నటుల కోసం మంచి చేయడానికి స్టార్ హీరోలు చాలాసార్లు ముందుకొచ్చారు. ఇప్పుడు భవనం కట్టడానికి కూడా ముందకొస్తే సరిపోతుంది కదా.
స్టార్ హీరోలందరూ తలో చేయి వేస్తే ఇది పెద్ద పని కాదు అని అందరూ అంటున్నారు. చాలా విషయాల కోసం ప్రభుత్వం దగ్గరకు వెళ్లి పనులు చేయించుకుంటున్నారు. ఈసారి కూడా స్టార్ హీరోలంతా ఒక్కటిగా సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్లి భూమి అడిగితే… ఇస్తారు. స్థలం వచ్చాక… భవనం కట్టడానికి డబ్బులు అంటే… హీరోలంతా తలో కొంత డబ్బులు వేసుకోవచ్చు. ఎవరికి తోచినంత వారు ఇస్తారు. ప్రజల కోసం ఇస్తున్నవాళ్లు తమ కోసం తాము ఇచ్చుకోరా.
అయితే ఈ పనులు చేయించడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇలా ముందుకు వస్తున్న వారిలో చిరంజీవి ఆధ్యుడు. కరోనా కష్టం సమయంలో ఆయన ముందుకొచ్చి నిత్యావసరాలు ఇచ్చారు. ఆ తర్వాత టీకాలు ఇప్పించారు. ఇప్పుడు భవనం విషయంలోనూ చిరంజీవి ముందుకొస్తే సరి. అయితే ‘మా’ భవనం కోసం 25 శాతం డబ్బులు ఇస్తానని మోహన్‌బాబు ఎప్పుడో మాటిచ్చేశారు. కాబట్టి ‘మా’ కోసం తొలి అడుగు వేసిన మోహన్‌బాబుతో చిరంజీవి కలసి భనవం పూర్తి చేయిస్తే సరి. చిరూ… కాస్త చూడు గురూ!