మీరు పోస్టర్ చూసి సినిమా కథ.. ఇంకా అవసరమైతే సినిమా ఫలితం కూడా చెప్పేస్తారా? అయితే ‘గుంటూరు కారం’ సినిమా పోస్టర్ చూసి ఆ పని చేసేయొద్దు. చిత్ర వర్గాలు చెబుతున్న మాటలు చూస్తుంటే.. పోస్టర్ చూసి మోసపోవద్దు అని స్వీట్ వార్నింగ్ ఇవ్వాల్సి వస్తోంది. ఎందుకంటే సినిమా కథకు, సినిమా నడిచే స్టయిల్‌కు… సినిమా పోస్టర్లకు చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటున్నారు. ఇప్పటివరకు సినిమా నుండి వచ్చిన పోస్టర్లు చూస్తే… ఎక్కువగా మాస్ మూమెంట్ కనిపిస్తోంది.
దీంతో ‘గుంటూరు కారం’ పేరు, బీడీలతో పోస్టర్, లుంగీ లుక్ అంతా… ప్రేక్షకుల్ని ఒక మూడ్‌లో ఉంచడానికే అని చెబుతున్నారు. అంటే ఇదొక మాస్ సినిమా అని నమ్మించి… థియేటర్లలో క్లాస్ టచ్ ఉన్న మాస్ సినిమా అనే ఫీల్ కలిగించాలని టీమ్ అనుకుంటోందట. దీని కోసమే తొలి షెడ్యూల్‌లో తీసిన ఫొటోలు, వీడియోలను తరచుగా విడుదల చేస్తున్నారు తప్ప.. అసలు ఫుటేజ్‌ను బయటకు తీసుకురావడం లేదని టాక్.
సినిమా తొలి షెడ్యూల్ ఓ ఫైట్ తీశాక.. అక్కడితో అది వదిలేసి చాలా గ్యాప్ ఇచ్చి మళ్లీ రీస్టార్ట్ చేశారు సినిమా. అప్పుడు తీసిన రషెష్ నుండే ఇప్పుడు లుక్స్ బయటకు వస్తున్నాయి. అయితే రెండో షెడ్యూల్ నుండి తీసిన ఫుటేజ్‌లో ఒక్క ముక్క కూడా బయటకు రాలేదు. ‘అల వైకుంఠపురములో’ టైమ్‌లో కూడా త్రివిక్రమ్ టీమ్ ఇలాంటి పనే చేసింది. ఇప్పుడు కూడా అదే చేస్తోంది.
నిజానికి సినిమా నుండి దసరాకు ఓ అప్‌డేట్ రావాల్సి ఉంది. అయితే దానికి దీపావళికి పోస్ట్ పోన్ చేశారు. ఇక సినిమాను అయితే సంక్రాంతికి తీసుకొస్తామని గత కొన్ని రోజులుగా చెబుతూనే ఉన్నారు. అనుకున్నట్లే పెద్ద పండగకు సినిమా వస్తుందని అంటున్నారు. దానికి తగ్గట్టుగా త్రివిక్రమ్ అండ్ కో. పని చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే (Guntur Kaaram) ‘గుంటూరు కారం’ ఘాటను జనవరి 12న చూడొచ్చు.