ఒక సినిమా గురించి అనుకుంటున్న విషయాలు, అనుకోని విషయాలు, ఆ టీమ్ ఇన్నర్‌గా డిస్కస్ చేసిన విషయాలు, ఒక్కోసారి పూర్తిగా సంబంధం లేని విషయాలు… పుకార్ల రూపంలో బయటకు వచ్చేస్తుంటాయి. తెలుగులో ‘పుకారు’ అని అంటే ఏదోలా ఉంటుందేమో కానీ, ఇంగ్లిష్‌లో ‘గాసిప్’ అంటే కాఫీ సిప్ అంత కమ్మగా ఉంటుంది. సినిమా జనాలకు గాసిప్ అంత నచ్చకపోవచ్చు, అభిమానులు మాత్రం ‘అవునా’ అంటూ ఆసక్తిగా వింటారు. అయితే గాసిప్ అంటే చిర్రెత్తుకొచ్చే దర్శకుల్లో హరీశ్ శంకర్ ఒకరు. ఎందుకో ఆయనకు గాసిప్ అంటే అస్సలు పడదు.
సినిమా గురించి టీమ్ నుండి ఎలాంటి సమాచారం రాకపోయినప్పుడు, అందులోనూ సమయానికి రాకపోయినప్పుడు అభిమానులు వెయిట్ చేస్తుంటారు. ఈ సమయంలో ఎక్కడ పుట్టుకొస్తుందో తెలియదు కానీ ఓ పుకారు బయటికొస్తుంది. అది అటు ఇటు తిరిగి వైరల్ అవుతుంది. అందులో ఎవరికీ చెడు ఉద్దేశం ఉండదు. కానీ ‘మేం అనుకోనిది, లేదంటే తర్వాత అధికారికంగా చెబుదాం అనుకున్నది’ బయటకు వచ్చేసరికి దర్శకనిర్మాతలు బాధపడతారు. అయితే మరీ ఆ గాసిప్ రాసిన ట్విటర్ ఖాతాను బ్లాక్ చేయాలనేంత కోపం అయితే ఉండదు కదా.
హరీశ్ శంకర్ రీసెంట్ టైమ్‌లో చేసిన ఓ ట్వీటు ఇలానే ఉంది. పవన్ కల్యాణ్‌తో చేస్తున్న సినిమాకు ‘సంచారి’, ‘స్టేట్‌కి ఒక్కడే’ లాంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయని కొంతమంది ట్వీట్లు చేస్తున్నారు. దాన్ని ఒక వ్యక్తి ప్రస్తావిస్తూ హరీశ్ సర్ మీరే స్పందించండి అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. దానికి స్పందించిన హరీశ్ శంకర్ ‘నేనూ గమనించాను. వాళ్లను బ్లాక్ చేయడం తప్ప నాకు వేరే ఏ ఆప్షన్ కనిపించడం లేదు’ అని చెప్పుకొచ్చాడు. అంత కోసం ఎందుకు డైరక్టర్ సర్ అని కొంతమంది నెటిజన్లు అంటున్నారు.
హరీశ్ శంకర్ పుకార్ల మీద ఇలా కోపం చూపించిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. ఎవరైనా పుకార్లను ట్వీట్లు చేస్తే ఇలా స్పందించారు. ఈ క్రమంలో కొన్ని మీడియా సంస్థలు రాసిన వార్తలను కూడా ట్వీట్ చేస్తూ ‘నన్ను అడిగితే నేను చెబుతా కదా’ అని ట్వీట్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఓకే పుకార్లు రాయొద్దు… కానీ పుకారు అంటేనే నిజం కాదు అని అర్థం. మరి దాని మీద కోపమెందుకు సర్.