‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయిక అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఆమె లుక్ ఇంచుమించు ‘దేవర’ సినిమాలోని లుక్‌లా ఉంటుంది అనే విషయం కూడా తెలిసిందే. ఎందుకంటే రెండు సినిమాల్లోనూ ఆమె పాత్ర గ్రామీణ నేపథ్యమున్న యువతే. దీంతో ‘పెద్ది’ సినిమాలో ఆమె పాత్ర గురించి కానీ, లుక్ గురించి కానీ ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదు. కానీ ప్రత్యేకంగా ఈరోజు ఓ డేట్ పెట్టుకుని మరీ చిత్రబృందం సినిమాలో జాన్వీ కపూర్ లుక్‌ని రిలీజ్ చేసింది. మామూలుగా ఇలాంటివి సినిమా విడుదల ముందు, పుట్టిన రోజులప్పుడు చేస్తారు.
దీంతో అసలు ‘పెద్ది’ సినిమా టీమ్ ఇప్పుడెందుకు లుక్ రిలీజ్ చేసింది అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనికి వినిపిస్తున్న పాజిబుల్ అండ్ నమ్మదగ్గ కారణం సినిమా విడుదల తేదీ అని చెప్పొచ్చు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల చేస్తామని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. చాలా రోజులుగా వీలున్నప్పుడల్లా ఆ డేట్‌ని చెబుతూ వస్తోంది. అయితే యశ్ ‘టాక్సిక్’ సినిమా ఆ డేట్‌కి వస్తుంది అని పక్కాగా చెప్పడంతో ‘పెద్ది’ వస్తుందా లేదా అనే చర్చ మొదలైంది.

అదేంటి నాని ‘ప్యారడైజ్’ సినిమా కూడా అప్పుడే కదా దాని గురించి మాట్లాడరేంటి అనుకుంటున్నారా? ఆ సినిమా అప్పుడే అని ఎప్పుడో చెప్పినా.. ఇప్పుడు దాని గురించి ఎలాంటి సప్పుడు లేదు. దీంతో ఆ సినిమా రాక అనౌన్స్‌మెంట్ మరోసారి రావాల్సిందే. ఇప్పుడు తాము వెనుకబడ్డామనే మాట రాకుండా ‘పెద్ది’ సినిమా టీమ్ చెప్పాలనుకుంది. అందుకోసమే జాన్వీ కపూర్‌ను ‘అచ్చియమ్మ’గా పరిచయం చేస్తూ రెండు పోస్టర్లు రూపొందించి జనాల్లోకి పంపించారు. తద్వారా సినిమా విడుదల తేదీ విషయంలో ఎలాంటి మార్పు లేదు అని చెప్పకనే చెప్పారు.
ఇక అచ్చియమ్మ.. భయమనేది ఎరుగని ఓ యువతి అంటూ ఆమె పాత్రను పరిచయం చేశారు. అయితే ఆమె లుక్, డ్రెస్సింగ్ చూస్తుంటే ‘దేవర’ సినిమాలో తంగమ్‌ని చూసినట్లగానే ఉంది. మరి బుచ్చిబాబు కూడా కొరటాల శివలా జాన్వీ కపూర్‌ను గ్లామర్ షోకే వాడారో లేక నిజంగా భయమే ఎరుగని నాయికగా చూపించారో చూడాలి.
