సినిమా టికెట్ బుకింగ్ కోసం బారెడు క్యూలైన్లు… ఈ విషయంలో ఇప్పటి సినిమా గోయర్స్ అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్లు చూడలేదు కాబట్టి. ఆన్‌లైన్ జమానాలో అలాంటి పరిస్థితి / దారుణ పరిస్థితి మళ్లీ వస్తుందని ఎవరూ అనుకోలేదు. దారుణ పరిస్థితి అని ఎందుకు అన్నాం అంటే… థియేటర్ల దగ్గర గొడవలు, లాఠీఛార్జిలు చాలానే చూశాం. ఇటీవల ఈ ఇబ్బంది తగ్గింది. థియేటర్‌లో ఇంట్లో కూర్చొన ఆన్‌లైన్‌లో టికెట్లు కొనేసి… షో టైమ్‌కి వచ్చేస్తున్నారు. అయితే ‘సలార్’ పుణ్యమా అని మళ్లీ ఆ పరిస్థితి వచ్చింది.
కొత్త సినిమా, అందులోనూ స్టార్ హీరో సినిమా, ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియా హీరో సినిమా కావడంతో ‘సలార్’ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఎక్కడో చిన్నగా ప్రచారం చేయడంలో లోపం కనిపించింది. దాంతో బజ్ తగ్గింది అనే కామెంట్స్ వచ్చాయి. ఇంకా ప్రచారం కూడా ఆలస్యమైంది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అంటే… సినిమా ఆఫ్‌లైన్ బుకింగ్‌లోకి రావడానికి ఇవి కూడా ఓ కారణమని నెటిజన్లు అంటున్నారు కాబట్టి. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా… సినిమా మీద బజ్ పెంచడానికే ఈ పని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
‘సలార్’ (Salaar) సినిమాకు సంబధించి ఆన్‌లైన్ బుకింగ్ ఆలస్యంగా మొదలైంది. ఆ మాటకొస్తే ప్రచారమే ఆలస్యమైంది. ఇవన్నీ వాళ్లవైపే ఉన్నాయి. అయితే టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం నుండి ఉత్తర్వులు రాకపోవడం వల్లనే ఆలస్యం అయ్యింది అని చెబుతున్నారు. ఇది కూడా ఓ కారణం. అయితే ఇంత జరిగినా ఆన్‌లైన్‌లోనే అడ్వాన్స్ బుకింగ్ పెట్టొచ్చు. కానీ ఎందుకోమరి ‘సలార్’ టీమ్ ఆఫ్‌లైన్ పెట్టింది. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు, ప్రేక్షకులు థియేటర్ల దగ్గరకు వచ్చారు.
టికెట్ల కోసం ఎప్పుడో చూసిన సందడి కనిపించింది. అయితే కొన్ని చోట్ల పరిస్థితులు అదుపుతప్పి లాఠీఛార్జి జరిగింది. అంతమంది అభిమానుల్ని అదుపు చేయడం సాధ్యం కాదని టీమ్‌కు కూడా తెలుసు. కానీ ఎందుకోమరి, ఎవరి చెప్పారో కానీ ఆఫ్‌లైన్‌కి వెళ్లారు. దాని కారణంగా అభిమానులు ఇబ్బంది పడుతున్నారు. థియేటర్ల వద్ద జనాల సందడి… మా సినిమాకే హైప్ ఉంది అంటూ సినిమా పీఆర్ టీమ్‌లు వీడియోలు తెగ షేర్ చేస్తున్నాయి. అయితే సమస్యలకు మసిపూసి ఇలా చేయడం సరికాదు అనే మాటలు వినిపిస్తున్నాయి. అయ్యిందేదో అయ్యింది ఈ పని మిగిలిన సినిమాలు చేయకపోతే మంచిది.