తెలుగు సినిమా పరిశ్రమ కథలకు గొడ్డు పోయిందా, మన దగ్గర రచయితలు లేరా, ఉన్న రచయితలు కథలు రాయడం మానేశారా, రాసిన కథలు అటక మీద పెట్టేశారా అదేంటి తెలుగు రచయితల మీద అంత కోపం, ఎందుకు ఇలా అంటున్నారు అనుకుంటున్నారా? తెలుగులో ఈ మధ్య అనౌన్స్ అవుతున్న సినిమాల గురించి వింటుంటే వినిపిస్తున్న మాట ఇది. కొత్త కుర్రాళ్ల సినిమాలు పక్కనపెడితే, స్టార్ హీరోల సినిమాల విషయంలోనే ఈ మాట అనాలని అనిపిస్తోంది. మేం చెప్పింది ఓవర్‌గా అనిపిపిస్తే ఒకసారి ఈ వార్త చదివేయండి.
ముందుగా చెప్పినట్లు మేం అంటున్న అగ్ర హీరోల గురించే. ఒక సినిమా మొదలుపెడితే వందల మందికి పని ఉంటుందని మన హీరోలు చాలామంది చెబుతుంటారు. దాని కోసం ఇటీవల చాలా సినిమాలు ప్రకటించారు. అందులో ముఖ్యంగా చిరంజీవి. రీఎంట్రీలో హిట్‌తో జోష్ మీదున్న చిరంజీవి చేతిలో వరుస సినిమాలున్నాయి. అందులో రీమేక్‌లు ఎన్ని అనేదే ప్రశ్న, ‘లూసిఫర్’, ‘వేదాళం’ ఈ రెండూ రీమేక్. ఆ తర్వాత మాట్లాడాల్సింది వెంకటేశ్ గురించి. ఆయన చేతిలో ఉన్న సినిమాలన్నీ రీమేకే. ప్రస్తుతం చేస్తున్న ‘నారప్ప’, ‘దృశ్యం 2’ చేతిలో ఉన్నాయి. ఇవి కాకుండా ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమా రీమేక్ చేస్తారని టాక్.
పవన్ కల్యాణ్ కూడా అదే పని చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన ‘వకీల్‌సాబ్’ రీమేక్ అనే విషయం తెలిసిందే. దీని తర్వాత చేస్తున్నది ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ రీమేకే. వీళ్లు కాకుండా నితిన్ ‘మ్యాస్ట్రో’ కూడా రీమేకే. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అయితే తన తర్వాతి రెండు సినిమాలు రీమేకే ఎంచుకున్నాడు. అందులో ‘కర్ణన్’ రీమేక్ ఒకటి. దీంతో మన దగ్గర ఉన్న రచయితలు అవసరమై కథలు ఇవ్వలేకపోతున్నారా? లేక అగ్ర హీరోలు ఆ కథలను టేకప్ చేయడం లేదా అనేది తెలియడం లేదు.