ఎంత పెద్ద స్టార్ డైరక్టర్ అయినా… హిట్ ట్రాక్‌లో లేకపోతే కొత్త సినిమా ఓకే అవ్వడం అంత తేలిక కాదు. డిఫరెంట్ కాన్సెప్ట్ పట్టుకొని, విభిన్నమైన స్టార్ కాస్ట్‌ఎంచుకొని, పర్‌ఫెక్ట్ టైమ్‌లో సినిమా తీస్తే.. కచ్చితంగా సింక్ అవుతుంది. హిట్ అవుతుంది. ప్రస్తుతం ‘రంగమార్తాండ’తో కృష్ణవంశీ అదే పనిలో ఉన్నారు. ఇటీవల ఆయన తన తర్వాతి సినిమా కూడా ప్రకటించారు. ‘అన్నం’ పేరుతో తెరకెక్కనున్న ఆ సినిమా ఇలా ప్రకటించారో లేదో… అలా పుకార్లు మొదలైపోయాయి. అయితే ఈ సారి అవి కొట్టడం కొట్టడం… మెగా స్టార్ ఇంటి తలుపునే కొడుతున్నాయి.
సమాజాంలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘అన్నం’ పోస్టర్‌ను డీటైల్డ్‌గా చూస్తే అరటాకులో అన్నం చుట్టూరా రక్తమే ఉంది. ఇంకా ఓ గొడ్డలి, తెగిన పుస్తెలు కనిపిస్తున్నాయి. అన్నం అనే టైటిల్‌లోనూ రక్తం ఉంది. నల్ల ధనం, ఉచిత పథకాలు, ప్రభుత్వాలు, మందులు, సాగు నీటి పారుదల, రిజిస్ట్రేషన్, ప్రభుత్వ ఉద్యోగులు, కబ్జా, ఆత్మహత్య, లంచం, రాజకీయం… ఇలా చాలా పేర్లు కనిపిస్తున్నాయి. ఇవి అన్నీ ప్రజల నిత్య జీవితంలో ఎదురయ్యే అంశాలే. వీటి ప్రకారం చూస్తే… ప్రస్తుతం ప్రజల కష్టాలు, బాధలు, కన్నీళ్ల నేపథ్యంలో రాసుకున్న కథలా కనిపిస్తోంది.
ఇలాంటి కథను చిరంజీవి ఒప్పుకుంటారా? అనే ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా కథను కృష్ణవంశీ… చిరుకు చెప్పారని టాక్. ఇలాంటి విమర్శనాత్మక, సందేశాత్మక చిత్రాలు చేయడానికి కృష్ణవంశీ దగ్గర చాలా ధైర్యం ఉంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చిరంజీవి తామరాకు మీద నీటిబొట్టులా ఉంటున్నారు. మరి ప్రభుత్వ తీరును, ఆలోచనలను, పని తీరును ప్రశ్నించే ‘అన్నం’ లాంటి సినిమాను చిరంజీవి చేస్తారా? చూద్దాం బాస్ ఏమంటారో. అన్నట్లు ‘గోవిందుడు అందరివాడేలే’ లాంటి ఫ్లాప్‌ను రామ్‌చరణ్‌కు ఇచ్చిన కృష్ణవంశీకి చిరు అవకాశం ఇస్తాడా.