చాలా రోజుల తర్వాత థియేటర్‌లో మంచి తెలుగు సినిమా చూద్దాం అనుకునేవారికి పిడుగు లాంటి వార్త. అందరూ అనుకుంటున్నట్లు, సినిమావాళ్లు చెబుతున్నట్లు ఈ క్రిస్‌మస్‌కు తెలుగు సినిమా పెద్ద తెర మీద కనిపించే అవకాశాలు తక్కువగా ఉన్నాయట. అదేంటి ప్రభుత్వం కూడా అనుమతిచ్చింది, ఒకటి రెండు సినిమాలు కూడా సిద్ధం అంటున్నారు కదా అంటారా. ఇక్కడే ఉంది అసలు సమస్య. మల్టీ ప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలకు, నిర్మాతల మధ్య వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ) వసూలు…
రెవెన్యూ షేరింగ్ లాంటి విషయాల మీద ఇంకా ఓ ఏకాభిప్రాయం రాలేదు. దీంతో సినిమా విడుదల అడుగులు ఎక్కడవి అక్కడ ఆగిపోయాయంట. మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలు, నిర్మాతల మధ్య కొన్ని రోజులుగా వీపీఎఫ్ తదితర విషయాల్లో చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. నిర్మాతల ఆలోచనకు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు నిర్ణయానికి పొంతన లేకపోవడంతో అసలు సమస్య తలెత్తింది. అంతే కాదు ఈ విషయంలో నిర్మాతలు కోపంగా ఉన్నారట. సమస్యలకు సొల్యూషన్ దొరకకపోతే కొత్త సినిమాల్ని విడుదల చేసేది లేదని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది.
దీంతో క్రిస్మస్‌కు థియేటర్లలో చేయాలనుకుంటున్న సినిమాల విషయంలో డౌట్స్ మొదలయ్యాయి. సమస్యల పరిష్కారం విషయంలో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ పట్టుపడుతోంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతోంది.
నిర్మాతల డిమాండ్లు ఏంటంటే…
* తెలుగు రాష్ట్రాల్లో అంతటా రెవెన్యూ షేరింగ్ ఒకేలా ఉండాలి.
* వసూళ్లలో నిర్మాతలకి ఎక్కువ భాగం ఇవ్వాలి.
* నిర్మాతల నుంచి వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ) వసూలు చేయకూడదు.
* షోస్‌లో తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇలా వివిధ డిమాండ్లతో నిర్మాతలు మల్టీప్లెక్స్ యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నాయి. ఇప్పుడు అవే కొలిక్కి రావడం లేదు.