కొన్ని హీరో – డైరక్టర్ల కాంబినేషన్ల గురించి మాట్లాడుకుంటే… వచ్చే హైనెస్‌కి పీక్స్ ఉంటుంది అసలు. అలాంటివాటిలో పవన్ కల్యాణ్ – పూరి జగన్నాథ్ జోడీ ఒకటి. ఇప్పటివరకు ఇద్దరూ కలసి చేసినవి రెండు సినిమాలే అయినా…. ఆ టీమ్ మళ్లీ కలుస్తుంది అని అంటే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంటుంది. చాలా రోజుల నుండి ఈ కాంబినేషన్ గురించి వార్తలు రావడం లేదు. కానీ ఏమైందో కానీ గత కొన్ని రోజులుగా ఈ కాంబో గురించి టాలీవుడ్ వర్గాల్లో ఒకటే చర్చ. మరి అందరూ అనుకుంటున్నట్లు ఆ కాంబినేషన్ సెట్ అవుతుందా… ఇద్దరూ హ్యాట్రిక్ సినిమా తీస్తారా?
‘బద్రి’తో 2000లో పూరి జగన్నాథ్‌ను దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం చేశారు పవన్ కల్యాణ్. ఆ తర్వాత ఈ కాంబో కోసం చాలా ప్రయత్నాలు జరిగినా ఓకే అవ్వలేదు. ఆ కథలన్నీ రవితేజ్ చేశారని ఓ టాక్ కూడా ఉంది. అయితే 2012లో ‘కెమెరామన్ గంగతో రాంబాబు’ ద్వారా సూపర్ హిట్‌కాంబో సెకండ్ సినిమా వచ్చింది. ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ తర్వాత సుమారు పదేళ్లు అవుతోంది ఇంకా ఈ కాంబో కలవలేదు. మధ్యలో ఈ టాపిక్ వచ్చినా ఇద్దరి నుండీ సరైన సమాధానం రాలేదు. అయితే ఇప్పుడు ఓ నిర్మాణ సంస్థ ఈ ఇద్దరినీ ఒక ట్రాక్ ఎక్కించే ప్రయత్నం చేస్తోందట.
పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తామని ఇటీవల నిర్మాతలు భగవాన్, పుల్లారావు ప్రకటించారు. అయితే ఎప్పుడు, దర్శకుడు ఎవరు అనే విషయాలు మాత్రం చెప్పలేదు. అయితే గత కొన్ని రోజులుగా భగవాన్ – పుల్లారావు పట్టుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ అని తెలుస్తోంది. అయితే ఇంకా పవన్ కల్యాణ్‌కు కథ కానీ, పాయింట్ కానీ వినిపించలేదు. ఒకవేళ అన్నీ ఓకే అయ్యాక సినిమా స్టార్ట్ చేద్దాం అన్నా కనీసం రెండేళ్ల తర్వాతనే. ఎందుకుంటే పవన్ చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యేసరికి ఆ సమయమే పడుతుంది.
‘అయ్యప్పనుమ్ కొషియమ్’ రీమేక్, క్రిష్ ‘హరిహర వీరమల్లు’, హరీశ్ శంకర్ – మైత్రీ మూవీ మేకర్స్, సురేందర్ రెడ్డి – రామ్ తాళ్లూరి సినిమాలు అవ్వాలి. అవి అయ్యాకనే భగవాన్ , పుల్లారావు టర్న్ వస్తుంది. ఈలోపు కరోనా థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారు. అదొస్తే సినిమా చిత్రీకరణలు మళ్లీ ఆగిపోతాయి. ఇలా పై నాలుగు సినిమాలు అయ్యేటప్పటికి రెండేళ్లు అంటే… ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు వచ్చేస్తాయి. ‘జనసేన’ పనుల కోసం పవన్ అటు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి పూరి సినిమా ఓకే అవుతుందా లేదా అనేది ఒక విషయమైతే… ఓకే అయితే ఎప్పుడు మొదలవుతుంది. ఎప్పుడు పూర్తవుతుంది. ఎప్పుడు వస్తుంది అనేది ఇక్కడ విషయం.