సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ఈ ఏడాది మొత్తం 8 సినిమాలకు వర్క్ చేశాడు. ఆయన సారధ్యంలో రూపొందిన ఆడియోల్లో “ఖైదీ నం.150” మినహా మరే చిత్రమూ ఇంస్టంట్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ గా నిలవలేకపోయింది. “నేను లోకల్, జై లవకుశ, దువ్వాడ జగన్నాధం, మిడిల్ క్లాస్ అబ్బాయి” వంటి చిత్రాల ఆల్బమ్స్ లో కేవలం ఒకటీ లేదా రెండు పాటలు మాత్రమే అలరించడం గమనార్హం. ఇదివరకూ దేవిశ్రీప్రసాద్ ఆల్బమ్ అంటే అన్నీ పాటలు సూపర్ హిట్ అయ్యేవి. మరి కంపోజర్ గా క్వాలిటీ తగ్గిందో లేక పెద్దగా పట్టించుకోవట్లేదో తెలియదు కానీ ఫుల్ లెంగ్త్ క్వాలిటీ ఆల్బమ్ మాత్రం దేవీ నుంచి వచ్చి చాలా కాలమవుతోంది.
అందులోనూ తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ తనను విడిచిపెట్టి “అ ఆ” సినిమాకి మిక్కీ జె.మేయర్ తో, “అజ్ణాతవాసి” సినిమాకి అనిరుధ్ తో మ్యూజిక్ చేయించుకోవడం, తన తర్వాత వచ్చిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ హిట్ల మీద హిట్లు కొడుతుండడంతో తాను కాస్త వెనుకబడిపోయాననే విషయాన్ని గ్రహించిన దేవిశ్రీప్రసాద్ తన తదుపరి చిత్రం “రంగస్థలం” కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడట. సాధారణంగా మాస్ బీట్స్ కి కూడా ఫ్యూజన్ మిక్స్ చేసే దేవిశ్రీప్రసాద్ తన పద్ధతి మార్చుకొని ఇండియన్ ఫోక్, ఇండీ పాప్ మ్యూజిక్ ను రంగస్థలం కోసం సిద్ధం చేస్తున్నాడట. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాడట. 2018 ప్రధామార్ధంలో విడుదలవుతున్న “రంగస్థలం” ఆడియోతో అందరూ “దేవి ఈజ్ బ్యాక్” అనిపించుకోవాలన్నదే దేవి ప్రస్తుత ధ్యేయం. మరి దేవిశ్రీప్రసాద్ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందో లేదో తెలియాలంటే ఆడియో మరి సినిమా విడుదల వరకూ వేచి చూడాల్సిందే.