కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్‌లో చాలా సినిమాలు విడుదలయ్యాయి. అయితే వాటిలో ఎక్కువ శాతం ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవే. కొన్ని మాత్రం కాస్త ప్రభావం చూపించగలిగాయి. కానీ… ప్రేక్షకుల్ని పెద్ద ఎత్తున థియేటర్లకు తీసుకొచ్చే పని మాత్రం చేయలేకపోయాయి. దీంతో సినిమా పరిశ్రమకు సరైన హిట్ కళ లోపించింది. అయితే సినిమా పరిశ్రమ కోరిక నెరవేరుస్తూ… నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను ‘అఖండ’తో వచ్చారు. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి.
అయితే ఈ జోరును తర్వాతి సినిమాలు కొనసాగించాలి. క్రికెట్, సినిమా రెండూ ఒకేలా ఉంటాయి. అందరూ కలిసి ఆడితేనే క్రికెట్‌లో గెలుస్తాం. అందరూ కలసి పని చేస్తేనే సినిమా హిట్ అవుతుంది. అలాగే క్రికెట్ ఇన్నింగ్స్‌కు ఓపెనింగ్ ఎంత ముఖ్యమో, సినిమాలకూ ఓపెనింగ్ అంతే ముఖ్యం. టాలీవుడ్‌కి ఆ పనిని బాలకృష్ణ – బోయపాటి చేసి పెట్టారు. ఇప్పుడు మిగిలిన సినిమాలు తమ వంతు పని చేయాలి. అంటే తమ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించాలి.
ఈ పని అల్లు అర్జున్, నాని, వరుణ్‌తేజ్ ఎందుకంటే వీళ్ల సినిమాలే ఈ నెలలో నెక్స్ట్ వస్తున్నాయి. మామూలుగా ఇయర్ ఎండింగ్‌లో సినిమాల విడుదల టాలీవుడ్‌లో తక్కువగానే ఉంటుంది. డిసెంబరు ఆఖరలో క్రిస్మస్ సందర్భంగా ఓ సినిమా తెచ్చేవారు. అయితే ఈ సారి ఎక్కువ సినిమాలు వరుస కడుతున్నాయి. డిసెంబరు 17న అల్లు అర్జున్ ‘పుష్ప’రాజ్ వస్తున్నాడు. బన్నీని సుకుమార్ పూర్తిగా మార్చేసి తీసుకొస్తున్నాడు. ఇక డిసెంబరు 24న నాని ‘శ్యామ్ సింగ రాయ్’ అవతారం ఎత్తుతున్నాడు.
అదే రోజు వరుణ్‌తేజ్ ‘గని’ కూడా రావాలి. కానీ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది అంటున్నారు. ఇదీ ఈ నెల సినిమాల లెక్క. బాలయ్య అందించి బోణీని సద్వినియోగం చేసుకొని వీళ్లంతా కొనసాగితే… వచ్చే నెల సంక్రాంతి సీజన్‌ను ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్, పవన్ కల్యాణ్ చూసుకుంటారు. ఏమంటారు హీరోలు అంతా మీ చేతుల్లోనే ఉంది.