తాము లైంగిక వేధింపులకు గురయ్యామని గత కొన్ని రోజులుగా హీరోయిన్స్ నిర్మొహమాటంగా చెబుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోను కాస్టింగ్ కౌచ్ ఉందని కొంతమంది తారలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. దానిపై కొన్ని రోజులు రచ్చ కూడా జరిగింది. హీరోయిన్స్ మాత్రమే కాదు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న మహిళలు కూడా లైంగిక వేధింపులకు గురయ్యారని ఇప్పుడే బయటపడుతోంది. పెళ్లిచూపులు సినిమాలో “మెరిసే మెరిసే” అనే పాట ద్వారా అందరికీ తెలిసిన శ్రేష్ఠ.. అర్జున్ రెడ్డి లో “మధురమే” అనే పాటతో బాగా పాపులర్ అయింది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో పుట్టి పెరిగిన ఈమె ఉస్మానియా యూనివర్సిటీ లో ఎల్ ఎల్ బీ చేసింది. సినిమారంగంపై ఉన్న ఆసక్తితో వెన్నెలకంటి దగ్గర పాటల రాయడంలో శిక్షణ అందుకుంది. జబర్దస్త్, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాలకు పాటలు రాసింది. పెళ్లిచూపులు సినిమాతో బ్రేక్ అందుకుంది.
ఈమె రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేసింది. తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పుకుంది. అలా వేధించిన వారి పేర్లు చెప్పగలరా? అనే ప్రశ్నకు ఆమె ఇలా సమాధానం ఇచ్చింది. ”పేర్లు చెబితే సరైన ఆధారాలు తీసుకురావాల్సి ఉంటుంది. అక్కడే నేను ఆగిపోవాల్సి వస్తోంది. ఓ విషయం మాత్రం చెప్పగలను. ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం ఓ ప్రొడ్యూసర్ ఇగో హర్ట్ అయింది. ఆ సమయంలో ఓ డైరెక్టర్ ఓ మాట కూడా అనేశాడు. నువ్ నన్నే కాదంటున్నావ్.. నాకే లొంగకపోతే ఇండస్ట్రీలో ఎలా ఉంటావో చూస్తానని డైరెక్టర్ బెదిరించాడు. కానీ ఇది ఒక నాలుగ్గోడల మధ్య జరిగిన విషయం. దీనికి నేను ఎక్కనుండి ప్రూఫ్ తీసుకురాగలను” అని వెల్లడించింది. శ్రేష్ఠ మాటలు చిత్ర పరిశ్రమలో అలజడి రేపింది.