తెలుగులో ‘కె.జి.ఎఫ్’ సినిమా ప్రమోషన్స్ కు రాజమౌళి వచ్చాడు అంటే.. తన స్నేహితుడు.. ‘వారాహి చలన చిత్రం’ అధినేత సాయి కొర్రపాటి కోసం అని అంతా అనుకున్నారు. కానీ అసలు విషయం వేరే ఉందని ఇటీవల ‘కె.జి.ఎఫ్’ హీరో యష్ చెప్పుకొచ్చాడు. యష్ మాట్లాడుతూ.. ” రాకీబాయ్ పాత్ర కోసం నేను చాలా కష్టపడ్డాను. మొదట కొన్ని సీన్లు షూట్ చేసాము. వాటితో మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అయితే ఒకానొక సందర్భంలో ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళిని కలవడం మాకు చాలా మేలు జరిగింది.
మా సినిమా మేకింగ్ కు అవసరమైన చర్చలు బెంగళూరులోని ఓ హోటల్లో జరుపుతుండగా.. అక్కడికి అనుకోకుండా రాజమౌళి వచ్చారు. ఆ టైములో ఆయనకు ‘కె.జి.ఎఫ్’ లోని కొన్ని విజువల్స్ చూపించాము. ఆయనకు అవి బాగా నచ్చాయి. తరువాత ఆయన మమ్మల్ని అప్రిషియేట్ చేసి ఎంకరేజ్ చేశారు. దాంతో మాకు నమ్మకం కూడా పెరిగింది. అంతేకాదు ఆయన తెలుగు, హిందీ భాషల్లోనూ డిస్ట్రిబ్యూటర్లకు ‘కె.జి.ఎఫ్’ గురించి చెప్పి బిజినెస్ బాగా జరగడానికి సాయం చేశారు” అంటూ చెప్పుకొచ్చాడు.
‘బాహుబలి'(సిరీస్) తరువాత పాన్ ఇండియా రేంజ్లో విజయం సాధించింది ‘కె.జి.ఎఫ్’ చిత్రం. కన్నడ సినిమాలకు అంత ఎక్కువ డిమాండ్ ఉండదు అని అంతా అంటుంటారు. అయితే ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడానికి మన రాజమౌళి కూడా కారణమయ్యాడన్న మాట.!