ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై జరిగిన అవకతవకల విషయంలో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన “వ్యూహం” (Vyooham) సినిమాకు ఏపీ ఫైబర్ నెట్ ద్వారా రూ. 2.15 కోట్ల చెల్లింపులు జరిగినట్లు సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి వెల్లడించారు. ఈ సినిమా విడుదల సమయంలోనే రకరకాల విమర్శలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా వచ్చిన ఈ ఆరోపణలు ఆ సినిమాపై మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా (Vyooham) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లను (Pawan Kalyan) టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల సమయంలో వైసీపీ మంత్రులు రోజా (Roja), అంబటి రాంబాబుల పాల్గొనడం, ప్రమోషన్స్‌లో నేరుగా వ్యవహరించడం పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ఈ సినిమాలో పొందుపరచిన రాజకీయ విమర్శలు ఆ పార్టీ పక్షపాతంతో కూడి ఉన్నాయని అప్పట్లోనే ప్రతిపక్షాలు ఆరోపించాయి.
చైర్మన్ జీవీ రెడ్డి మాట్లాడుతూ, “ఫైబర్ నెట్ తరపున ఈ సినిమా కోసం భారీ మొత్తంలో చెల్లింపులు జరిపారు. వ్యూస్ ఆధారంగా డబ్బు చెల్లించాలన్న ఒప్పందం ఉండగా, కేవలం 1,863 వ్యూస్ మాత్రమే వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇది ఒక్కో వ్యూకి సుమారు రూ. 11,000 చెల్లించినట్లు ఉంటుంది,” అని వెల్లడించారు. ఆర్ధిక చిత్తశుద్ధి లేకుండా ఫైబర్ నెట్ సంస్థ నిధులను విచిత్రమైన రీతిలో ఖర్చు చేశారని ఆరోపించారు.
2019 వరకు లక్షల మంది ప్రజలకు సేవలు అందించిన ఫైబర్ నెట్ ప్రాజెక్ట్, వైసీపీ హయాంలో మరుగున పడినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. కనెక్షన్ల సంఖ్య గణనీయంగా తగ్గడం, ఆదాయానికి నష్టం కలగడం వంటి అంశాలను జీవీ రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్ట్‌ను రివైవ్ చేయడం కోసం కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అలాగే గతంలో జరిగిన తప్పులను సరిచేసే ప్రయత్నంలో ఉన్నామని వివరించారు.