తెలుగు సినీ చరిత్రలో ఎన్నో మధుర జ్ఞాపకాలు మూటగట్టుకున్న థియేటర్స్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ ఒకటి. 1980లో ప్రారంభమైన ఈ థియేటర్ హైదరాబాదీ ప్రేక్షకులకు ప్రత్యేక అనుబంధంగా నిలిచింది. మొదటగా హిందీ చిత్రం ‘షాలిమార్’ ప్రదర్శనతో ఆరంభమైన ఈ ప్రయాణం, బాలీవుడ్ సూపర్ హిట్ ‘షోలే’ ప్రదర్శనతో మరింత పటిష్టమైంది. అప్పటి నుంచి సంధ్య థియేటర్ కేవలం సినిమాలు చూసే స్థలంగా కాదు, స్టార్స్ సినిమాలకు సెంటిమెంట్‌గా మారింది.
Pushpa 2 The Rule
సంధ్య థియేటర్ తొలినాళ్లలో 1500 మంది ప్రేక్షకులను ఆహ్వానించగల సీటింగ్ సామర్థ్యం కలిగి ఉండేది. మారిన కాలంతో పాటు మోడర్నైజేషన్ జరుగుతుండటంతో అది 1323 సీట్లకు పరిమితమైంది. కానీ ప్రేక్షకుల ఉత్సాహానికి ఆ పరిమితులు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రధానంగా స్టార్ హీరోల సినిమాలు ఈ థియేటర్‌లో విడుదల చేయడం ఒక సెంటిమెంట్‌గా మారింది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో పలు థియేటర్లున్నప్పటికీ సంధ్య థియేటర్‌కున్న ప్రత్యేకత కారణంగా నిర్మాతలు ఈ థియేటర్‌లో తమ సినిమాలను విడుదల చేయాలని కృషి చేసేవారు.
మల్టీప్లెక్స్ యుగం రాకముందు సంధ్య 70MM ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. స్టార్ హీరోలు కూడా తమ చిత్రాల విడుదలకు సంధ్యను ముఖ్యంగా ఎంపిక చేసేవారు. ఒకప్పుడు ఈ థియేటర్‌లో టికెట్ కోసం రోడ్డు వరకు లైన్లు కట్టేవారు. ఇది కేవలం సినిమా ప్రదర్శన స్థలమే కాదు, ప్రేక్షకుల ఊహలలో ఒక ఐకాన్‌గా మారింది. అయితే, ఇటీవల పుష్ప 2 (Pushpa 2 The Rule) ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట సంఘటన ఈ చారిత్రాత్మక థియేటర్ భవిష్యత్తుపై మబ్బులు కమ్మింది.
రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటన తర్వాత, పోలీసులు సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పదిరోజుల్లో సరైన సమాధానం ఇవ్వకుంటే థియేటర్ మూతపడే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పరిణామాలు సినీ ప్రపంచానికే కాదు, థియేటర్ అభిమానులకు కూడా కలవరాన్ని కలిగిస్తున్నాయి.