‘మిర్చి’.. రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫిలిం.. అలాగే డార్లింగ్‌కి మెమరబుల్ మూవీ.. అంతకుముందు ‘రెబల్’ వంటి డిజాస్టర్ ఇచ్చాడు. సరిగ్గా నాలుగు నెలల తర్వాత నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కి ‘మిర్చి’ రూపంలో ఫుల్ మీల్స్ పెట్టాడు. తన హోమ్ బ్యానర్ లాంటి యూవీ క్రియేషన్స్ నిర్మాణంలోకి ఎంటర్ అయిన ఫస్ట్ మూవీ.. ఫ్రెండ్స్ వంశీ – ప్రమోద్‌లను ప్రొడ్యూసర్స్‌గా పరిచయం చేస్తూ..
అప్పటికి డైలాగ్ రైటర్‌గా ‘భద్ర’, ‘మున్నా’, ‘ఒక్కడున్నాడు’, ‘బృందావనం’, ‘ఊసరవెల్లి’ సినిమాలతో ఆకట్టుకున్న కొరటాల శివను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. భారీ బడ్జెట్‌తో.. టాలెంటెడ్ టెక్నీషియన్స్, హెవీ స్టార్ కాస్టింగ్‌తో రాజీ పడకుండా రూపొందించారు. 2013 ఫిబ్రవరి 8న భారీ స్థాయిలో రిలీజ్ అయిన ‘మిర్చి’.. 2023 ఫిబ్రవరి 8 నాటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం..
‘బిల్లా’ తర్వాత ప్రభాస్, అనుష్క కలిసి నటించిన సెకండ్ సినిమా ఇది.. ఒకప్పటి కథానాయిక నదియా రీ ఎంట్రీ ఇచ్చారు. సత్య రాజ్, ఆదిత్య మీనన్, సంపత్ రాజ్, సుబ్బరాజు, రిచా గంగోపాధ్యాయ్, బ్రహ్మానందం, నాగినీడు, ప్రియ, హేమ, సుప్రీత్, బెనర్జీ, సత్యం రాజేష్ తదితరులు నటించారు. ఇటలీలో గిటారిస్ట్‌గా హీరో క్యారెక్టర్‌ని పరిచయం చేసి.. పల్నాడు వరకు తీసుకొచ్చి.. గతంలో తమ రెండు కుటుంబాల మధ్య ఉన్న పగని ప్రేమతో చంపెయ్యాలనుకునేలా చూపించడం..
ఫ్లాష్ బ్యాక్‌లో తన ఆవేశం కారణంగా జరిగిన పొరపాటు వల్ల జై పాత్రలో మార్పు రావడం.. ప్లాన్ ప్రకారం తమ ప్రాంతంలో ఫ్యాక్షనిజాన్ని ఎలా అంతమొందించాడు.. శత్రువులో ఎలా మార్పు తీసుకొచ్చాడనే ఆకట్టుకునే అంశాలతో కొరటాల అద్భుతమైన కథ రాసుకున్నాడు. దానికి అందమైన, ఆలోచింపజేసే డైలాగ్స్ యాడ్ అవడం.. లవ్, కామెడీ, యాక్షన్‌తో పాటు ఎమోషన్స్‌కి సమపాళ్లలో ఉండడంతో ప్రేక్షకాభిమానులను ఆకట్టుకుంది ‘మిర్చి’.. కథ, హీరో పాత్ర ప్రకారం ముందుగా ‘వారథి’ అనే పేరు అనుకుని.. చివరకు ‘మిర్చి’ ఫిక్స్ చేశారు.
ఆడియో ఫంక్షన్‌లో పెదనాన్నతో డ్యాన్స్..
రెబల్ స్టార్ కృష్ణంరాజు ‘మిర్చి’ ఆడియో వేడుకకు అతిథిగా విచ్చేశారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. దిల్ రాజు, కృష్ణం రాజులతో ఫస్ట్ పాటకు స్టెప్పులేయించాడు. ముందుగా కృష్ణం రాజు డ్యాన్స్ చేయగా.. అందరూ గోల గోల చేశారు. తర్వాత ప్రభాస్, అనుష్క, రాజమౌళి కూడా డ్యాన్స్ చేశారు. ఇక ‘మిర్చి’ ట్రైలర్.. 1 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న ఫస్ట్ తెలుగు ట్రైలర్‌గా రికార్డ్ సెట్ చేసింది..
అన్‌సీజన్‌లో రిలీజ్ చేసి.. బ్లాక్ బస్టర్ కొట్టారు..
సాధారణంగా ఫిబ్రవరి నెలలో తమ సినిమాలను రిలీజ్ చేయడానికి స్టార్ హీరోలెవరూ ధైర్యం చేయరు.. ఎందుకంటే ఎగ్జామ్స్ సీజన్.. దాదాపుగా చాలా మంది థియేటర్లకు వచ్చే అవకాశముండదు.. కానీ కాన్సెప్ట్ మీద నమ్మకంతో.. వాళ్లకీ మొదటి సినిమానే అయినా కానీ రిలీజ్ చేసేశారు యూవీ క్రియేషన్స్ వారు.. ప్రభాస్ గత చిత్రం డిజాస్టర్, కొత్త డైరెక్టర్, కొత్త నిర్మాతలు, పైగా సరైన సీజన్ కాదు.. అయినా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. ఇండస్ట్రీ వర్గాల వారిని ఆశ్చర్యపరిచింది ‘మిర్చి’..
అలాగే దాదాపు కోటి రూపాయల ఖర్చుతో.. ప్రభాస్ ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన రెయిన్ ఫైట్‌ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రిలీజ్ అప్పుడు సినిమాలో పెట్టలేకపోయారు. తర్వాత కొద్ది రోజులకు ఆ యాక్షన్ ఎపిసోడ్ యాడ్ చేశారు. దాన్ని చూడ్డానికి కూడా ఫ్యాన్స్, ఆడియన్స్ థియేటర్లకు వచ్చారంటే.. సినిమా ఎంతలా కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
కొరటాల మాటలు – డీఎస్పీ పాటలు..
కొరటాల తన పెన్ను పవర్ చూపించారు. లవ్, ఎమోషనల్ సీన్లలో మనసుని హత్తుకోవడంతో పాటు ఆలోచింపజేసేలా ఆయన రాసిన మాటలు ఆకట్టుకున్నాయి. ఇక దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ అయితే సింప్లీ సూపర్బ్.. బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాడు. రికార్డ్ స్థాయి కలెక్షన్లలో, అత్యధిక సెంటర్లలో 100 రోజులు ఆడిన బ్లాక్ బస్టర్ ‘మిర్చి’ 10 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.