సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) – 2023 వేడుకలకు రంగం సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబరు 15, 16 తేదీల్లో ఈ దక్షిణాది సినిమా వేడుకను ఘనంగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది నామినేషన్లను తాజాగా ప్రకటించారు. అందరూ ఊహించిన విధంగానే ఆస్కార్‌కి వెళ్లిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకు భారీ స్థాయిలో నామినేషన్లు దక్కాయి. రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ సినిమాకు ఏకంగా 11 కేటగిరీల్లో నామినేషన్స్ దక్కింది. దుబాయ్‌లోని DWTCలో సైమా వేడుక జరగనుంది.
ఆ తర్వాత ఆ స్థాయిలో నామినేషన్లు వచ్చిన సినిమా ‘సీతారామం’. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా పది కేటగిరిల్లో నామినేషన్లు వచ్చాయి. తమిళంలో అత్యధికంగా 10 నామినేషన్స్‌తో ‘పొన్నియిన్ సెల్వన్ 1’ తొలి స్థానంలో నిలిచింది. మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, కార్తి నటించిన సినిమా ఇది. ఆ తర్వాత కమల్ హాసన్ – లోకేష్ కనగరాజ్‌ల ‘విక్రమ్’ నిలిచింది. ఈ సినిమాకు మొత్తంగా 9 నామినేషన్స్ దక్కాయి.
కన్నడలో చూస్తే… రిషబ్ శెట్టి ‘కాంతార’, యశ్ – ప్రశాంత్ నీల్ ‘కేజీయఫ్ 2’ సినిమాలు చెరో 11 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకున్నారు. అమల్ నీరద్ – మమ్ముటిల ‘భీష్మ పర్వం’ చిత్రానికి 8 నామినేషన్స్ రాగా, టొవినో థామస్ ‘థల్లుమాల’ చిత్రానికి ఏడు నామినేషన్స్ దక్కాయి. మలయళంలో ఈసారి ఆరు చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీపడుతున్నాయి. తెలుగు నుండి ‘ఉత్తమ చిత్రం’ కేటగిరిలో ‘RRR’, సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’, నిఖిల్ ‘కార్తికేయ 2’, అడివి శేష్ ‘మేజర్’, ‘సీతారామం’ పోటీలో ఉన్నాయి.
మలయాళంలో ఉత్తమ చిత్రం కేటగిరీలో ‘భీష్మపర్వం’, ‘హృదయం’, ‘జయ జయ జయ జయ హే’, ‘ౠ థాన్ కేస్ కోడు’, ‘జన గన మన’, ‘థల్లుమాళ’ నిలిచాయి. తమిళ పరిశ్రమ నుండి ‘లవ్ టుడే’, ‘పొన్నియిన్ సెల్వన్ 1’, ‘రాకెట్రీ’, ‘తిరు’,‘విక్రమ్’ ఉన్నాయి. కన్నడ నాట నుండి ‘777 ఛార్లి’, ‘కాంతార’, ‘కేజీయఫ్ 2’, ‘లవ్ మాక్‌టైల్’, ‘విక్రాంత్ రోణ’ నిలిచాయి.