మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అతడు’ ‘ఖలేజా’ తర్వాత రూపొందిన చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కీలక పాత్ర పోషించింది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీత దర్శకుడు. జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది.
దీంతో ఈ సినిమాకి భారీ నష్టాలు రావడం ఖాయమని, త్రివిక్రమ్ కెరీర్లో మరో ‘అజ్ఞాతవాసి’ గా మిగిలిపోతుంది అని అంతా అనుకున్నారు. కానీ టాక్ తో సంబంధం లేకుండా ఈ మూవీ మంచి కలెక్షన్స్ ని సాధించింది. ‘గుంటూరు కారం’ సినిమాకి రూ.131 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా మొదటి వారానికి గాను రూ.212 కోట్లు గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసినట్లు చిత్ర బృందం అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది.
ఆ రకంగా చూసుకుంటే సినిమాకి రూ.140 కోట్ల వరకు షేర్ వచ్చి బ్రేక్ ఈవెన్ అయిపోవడం మాత్రమే కాకుండా లాభాలు కూడా వచ్చి ఉండాలి. కానీ ట్రాకింగ్ లెక్కల ప్రకారం సినిమా రూ.101 కోట్ల షేర్ మార్క్ వద్దే ఉంది. పెద్ద సినిమాలకి పోస్టర్స్ పై ఎక్కువ నంబర్స్ వేసుకుని ప్రమోషన్ చేసుకోవడం సహజం.
అయితే ఎక్కువ నంబర్లు వేసుకుంటే ప్రమోషన్ సంగతి ఎలా ఉన్నా.. అంత మొత్తానికి వారు జీ.ఎస్.టీ కూడా పే చేయాల్సి వస్తుంది. అప్పుడు పోస్టర్ పై వేసిన రూ.212 కోట్లకి (Guntur Kaaram) ‘గుంటూరు కారం’ చిత్ర బృందం 18 శాతం జీఎస్.టీ కట్టాల్సిందే.