టాలీవుడ్‌లో ఏటా సంక్రాంతి ఫైట్… కోళ్ల పందేలంత మజాగా ఉంటుంది. కనీసం ముగ్గురు, నలుగురు పెద్ద హీరోలు పందెంలోకి వచ్చి అదరగొట్టాలని చూస్తుంటారు. అయితే ఒకటో, రెండో సినిమాలు విజయం సాధిస్తాయి. మిగిలినవి మూలకు వెళ్లిపోతాయి. అలా 2023 సంక్రాంతికి సంబంధించి పందెం కోళ్లు ఏవి అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. అయితే ఇందులో ఆఖరి వరకు ఎవరు పందెంలో ఉంటారు, ఎవరు తప్పుకుంటారు అనేది చూడాలి.
* వచ్చే సంక్రాంతికి విడుదలవ్వబోయే సినిమాల జాబితా అంటే ‘ఆదిపురుష్’తోనే మొదలుపెట్టాలి. ఎందుకంటే సంక్రాంతి బరిలో ఉన్నాం అని ప్రకటించిన తొలి సినిమా అదే కాబట్టి. ప్రభాస్ – కృతి సనన్ – ఓం రౌత్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 11న రావాలి. కానీ ఆలస్యం కారణంగా జనవరి 12, 2023కి తీసుకెళ్లారు.
* ఇక సంక్రాంతి బరిలోకి నిలిచిన రెండో చిత్రం దళపతి విజయ్ ‘వారసుడు’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు తొలిసారి తమిళంలో రూపొందిస్తున్న సినిమా ఇది. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం తమిళంలో రూపొంది, తెలుగులోకి వస్తోంది. ఈ సినిమాను పొంగల్‌కి తీసుకొస్తామని మొన్నే చెప్పారు.
* పవన్ కల్యాణ్ నుండి అభిమానులు ఎదురు చూసి చూసి మరచిపోవడానికి సిద్ధమవుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తొలుత ఈ దసరాకు వస్తుందని చెప్పారు. కానీ చిత్రీకరణ ఆలస్యమవ్వడంతో సంక్రాంతికి మారుస్తున్నారట. ఇందులో నిధి అగర్వాల్ కథానాయిక.
* ఇక లేటెస్ట్‌గా సంక్రాంతి బరిని ఎంచుకున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (టైటిల్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు). బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రమిది. శ్రుతి హాసన్ కథానాయిక. ఈ సినిమాను పెద్ద పండగకు తీసుకొస్తామని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఇందులో రవితేజ, కేథరిన్ ఇతర ప్రధానపాత్రధారులట.
ఇలా వచ్చే సంక్రాంతికి నాలుగు సినిమాలు బరిలో ఉన్నాయి. అయితే ఇన్ని ఒకేసారి రావడం, థియేటర్ల లభ్యత మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇందులో కనీసం రెండు సినిమాలు వాయిదా పడటమో, ముందుగా విడుదలవ్వటమో జరుగుతుంది. అవేవి అనేదే ఇక్కడ ప్రశ్న.