కరోనా వల్ల సినీ పరిశ్రమ అతలాకుతలం అయిపోయింది. అయితే థియేటర్లు 2020 డిసెంబర్ ఎండింగ్ నుండీ తెరుచుకోవడం.. ఆ తరువాత సంక్రాంతికి విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను నమోదు చేయడం,ఇక ఫిబ్రవరి లో ‘ఉప్పెన’, మార్చి లో ‘జాతి రత్నాలు’ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్లు అవ్వడంతో.. టాలీవుడ్ ఇండస్ట్రీ త్వరగానే కోలుకుంది అని అంతా భావించారు. కానీ ఏప్రిల్ లో పెద్ద దెబ్బ పడింది. కరోనా సెకండ్ వేవ్ ఘోరంగా విజృంభించడంతో జనాలు థియేటర్లకు రావడం తగ్గించేశారు.
పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా ఉన్నా జనాలు.. థియేటర్లకు రాలేదు అంటే పరిస్థితి ఎంత ఆందోళన కరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.అందులోనూ థియేటర్లు కూడా మూతపడ్డాయి. ఇప్పుడు మళ్ళీ తెరుచుకున్నాయి.. ఈసారి జనాలు వస్తారన్న గ్యారెంటీ లేదు. వాళ్ళు రావాలన్నా.. ఈసారి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కోలుకోవాలన్నా ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతోనే అది సాధ్యమవుతుంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే 2018 నవంబర్ లో మొదలైన ఈ చిత్రం ఇంకా షూటింగ్ పూర్తికాలేదు.
పాండమిక్ వల్ల 8 నెలల పాటు షూటింగ్ వాయిదా పడింది. మొన్నామధ్య క్లైమాక్స్ చిత్రీకరణ ప్రారంభమైనట్టు తెలియజేసారు.అంతేకాదు అక్టోబర్ 13న సినిమాని విడుదల చెయ్యబోతున్నట్టు కూడా ప్రకటించారు. కానీ మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం షూటింగ్ ఫినిష్ కావడానికి మరో 40 రోజులు టైం పడుతుంది అని ఇటీవల ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేసాడు. దానిని బట్టి చూస్తే ఈ ఏడాది కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదల లేనట్లే అని స్పష్టమవుతుంది.