‘దేవర’ సినిమాకు సంబంధించి తెలుగు ప్రచారం జరగలేదు అని అభిమానులు నిరాశగానే ఉన్నారు. సినిమా జనాల్లోకి ఇంకాస్త బాగా వెళ్లడానికి ఆ ప్రచారం ఉపయోగపడేది అనే మాట వినిపించింది. అయితే ఇంటర్వ్యూ ఇచ్చి అదే ప్రచారం అని దర్శకుడు కొరటాల శివ అన్నారు అనుకోండి. ఆ విషయం వదిలేస్తే.. సినిమా ప్రచారమే కాదు.. సక్సెస్ మీట్ కూడా లేదు. ఇది పుకారు కాదు. ‘దేవర’ సినిమా రిలీజ్ నిర్మాత చెప్పిన విషయమే ఇది. రిలీజ్ నిర్మాత ఏంటి? అనుకుంటున్నారా. ఆ విషయం ఆఖరున చెబుతాం లెండి.
Devara
తొలి మూడు రోజుల్లోనే రూ. 300 కోట్లు వసూలు చేసిన ‘దేవర’ సినిమా.. తర్వాతి మూడు రోజుల్లో సుమారు రూ. 100 కోట్ల వసూళ్లు అందుకుంది. మొత్తంగా రూ. 400 కోట్లు రావడంతో సినిమా సక్సెస్ మీట్ ఎప్పుడు? అనే ప్రశ్న గత కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఈ ఆశలతో ఉన్న అభిమానుల ఉత్సాహం మీద నిర్మాత నాగవంశీ నీళ్లు చల్లారు. సక్సెస్ మీట్ చేయడం కోసం మేము తీవ్రంగా ప్రయత్నించాం కానీ అనుమతులు రాలేదు అని నాగవంశీ చెప్పారు.
దసరా – దేవీ నవరాత్రి ఉత్సవాల కారణంగా అవుట్ డోర్ ఈవెంట్ చేయడానికి తెలుగు రాష్ట్రాల నుండి అనుమతులు రాలేదు. అందుకే ‘దేవర’ సక్సెస్ మీట్ చేయలేకపోతున్నాం అని నాగవంశీ చెప్పారు. దీనికిగాను అభిమానులు, ప్రేక్షకులకు క్షమాపణలు కూడా చెప్పారు. అంతేకాదు ప్రయత్నాలు ఆపలేదు. పరిస్థితిని అర్థం చేసుకోవాలని కూడా కోరాఉ. ఈ మేరకు నాగవంశీ ట్వీట్ చేశారు. దీంతో అభిమానులు తీవ్రంగా నిరాశచెందారు.
ఇక పైన చెప్పిన ‘రిలీజ్ నిర్మాత’ కాన్సెప్ట్ ఏంటంటే.. ఈ సినిమాను కొరటాల మిత్రుడు మిక్కిలినేని సుధాకర్, కల్యాణ్ రామ్ నిర్మించారు. అయితే రిలీజ్ సమయానికి మొత్తం ప్రాజెక్ట్‌ను భారీ మొత్తం వెచ్చింది నాగవంశీ తీసుకున్నారు. పంపిణీ ఆయన అంటున్నారు కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల పెంపు కోసం నాగవంశీ అప్లై చేసినప్పుడు నిర్మాత అనే చెప్పారు. కాబట్టి ఆయన రిలీజ్ నిర్మాత.