పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలు ప్లాప్ అవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ డీలా పడ్డారు. ‘ఆదిపురుష్’తో తమ అభిమాన హీరో కచ్చితంగా హిట్ కొడతారని భావిస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ కూడా సినిమా అద్భుతంగా ఉంటుందని.. ఇదొక విజువల్ వండర్ అని చెప్పుకొచ్చారు. కానీ టీజర్ విడుదలైన తరువాత అందరి అంచనాలు తారుమారయ్యాయి. గ్రాఫిక్స్ వర్క్ జనాలకు అసలు నచ్చలేదు. నటీనటుల అప్పియరెన్స్ కార్టూన్ క్యారెక్టర్స్ మాదిరి ఉండడంతో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు.
ఇంత నెగెటివిటీను ‘ఆదిపురుష్’ టీమ్ ఊహించలేదు. దీంతో 3Dలో టీజర్ ను మీడియాకు చూపించి కొంత డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. 3D వెర్షన్ టీజర్ గురించి మీడియా ఎంత పాజిటివ్ గా రాసినా.. సినిమాపై నెగెటివిటీను ఆపలేకపోతున్నారు. రూ.500 కోట్ల బడ్జెట్ సినిమా మీద ఇంతలా ట్రోలింగ్ జరగడం చూసి భయపడిన టీమ్.. ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నిజానికి ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు.
సినిమాలో మార్పులు చేయకుండా.. అలానే రిలీజ్ చేస్తే దెబ్బ పడుతుందని అర్ధం చేసుకున్న మేకర్స్.. ఇప్పుడు కరెక్షన్స్ చేయడం మొదలుపెట్టారు. అలానే సోలో రిలీజ్ ఉంటే కలెక్షన్స్ వసూలు చేసుకునే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు సినిమాను వాయిదా వేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ లో చిన్న కరెక్షన్స్ చేసి సరిపెట్టకుండా.. చాలా వరకు మార్పులు చేయడానికి రెడీ అయ్యారు. మళ్లీ కొత్తగా వీఎఫ్ఎక్స్ స్టూడియోస్ తో ఒప్పందాలు చేసుకొని..
పెద్ద ఎత్తున మార్పులు చేస్తున్నారు. దీనికోసం కొత్తగా రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. అంత ఖర్చు పెడితే తప్ప.. అనుకున్న స్థాయిలో భారీ కలెక్షన్స్ రావని, బడ్జెట్ రికవరీ కష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.