‘ఆదిపురుష్’ సినిమా గురించి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేశారో, ఇప్పుడు అంతగా ద్వేషిస్తున్నారు. సినిమా టీజర్‌లో ప్రభాస్ లుక్, కాన్సెప్ట్, చిత్రీకరించిన విధానం, గ్రాఫిక్స్.. ఇలా ఏవీ అభిమానులకు నచ్చలేదు. దీంతో సినిమా గురించి బజ్ ఒక్కసారిగా ఆగిపోయింది. అయితే ఈ సినిమా విషయంలో తేడా ఎక్కడ జరిగింది అనే విషయంలో సినిమా డీవోపీ ఆసక్తిక కామెంట్స్ చేశారు. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. రూ.500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఇది.
సినిమా టీజర్ చూసి వచ్చిన ట్రోల్స్, విమర్శలు, ఫీడ్ బ్యాక్ ప్రకారం ప్రస్తుతం టీమ్ మళ్లీ విజువల్ ఎఫెక్ట్స్ పనుల మీద దృష్టి పెట్టింది. దీంతో సినిమాను ఆరు నెలలు వాయిదా వేశారు. సినిమా డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ కార్తీక్ పళణి ఈ సినిమా గురించి ఇటీవల ఓ మీడియాతో మాట్లాడారు. ‘ఆదిపురుష్’ సినిమా అందరూ అనుకుంటున్న పూర్తిగా మోషన్ క్యాప్చర్ స్టైల్‌లో చిత్రీకరించలేదు. సినిమాలో కొన్ని లైవ్ యాక్షన్ క్యారెక్టర్లు కూడా ఉంటాయని చెప్పారు.
మోషన్ క్యాప్చర్ పాత్రలు, లైవ్ యాక్షన్ పాత్రలు ఒకే సీన్‌లో కనిపిస్తాయట. ఇలాంటి టెక్నాలజీ మనకి పూర్తిగా కొత్త అని కూడా చెప్పారు. ‘ఆదిపురుష్’ సినమాకు తొలుత ఫిక్స్‌డ్ బడ్జెట్ అనుకున్నాం. కానీ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తీయాలనే ఆలోచనతో బడ్జెట్ పెరిగిపోయింది. అయితే అవసరమైన టెక్నాలజీ తీసుకొచ్చినా.. దాన్ని సరిగ్గా వాడుకోవాలి. అప్పుడే అవుట్‌పుట్ బాగా వస్తుంది. అయితే మన దేశంలో బడ్జెట్, బిజినెస్‌ను బేరీజు వేసుకొని కొంచెం చవకైన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వెర్షన్‌ను కొనుగోలు చేశాం.
ఆ తర్వాత ఎన్నో చర్చలు జరిపి.. సినిమాను పూర్తిగా బ్లూ స్క్రీన్‌లో తీశాం. అంతా ఆ స్క్రీన్ ప్లేస్‌లో ఉన్నట్లు ఊహించుకుని నటించారు, అదే చిత్రీకరించాం. ఇదంతా వింటుంటే బడ్జెట్ విషయంలో వెనుకంజ వేసి.. తక్కువ రకం టెక్నాలజీ తీసుకోవడం వల్లే సినిమా మీద విమర్శలు వచ్చాయి అని అర్థమవుతోంది. మరిప్పుడు ఆరు నెలల టైమ్ తీసుకొని మారుస్తున్న వాటిలో ఎంతవరకు మెరుగ్గా ఉంటాయనేది చూడాలి.