భారతీయ సినిమా పరిశ్రమలో ఓ సినిమాకు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నాయి, సినిమా అంటే విమర్శకులు చెలరేగిపోయారు, మీమర్స్ మైమరచిపోయి ట్వీట్లు చేశారు అంటే.. అది కచ్చితంగా ‘ఆదిపురుష్’ సినిమా అనే చెప్పాలి. అప్పటివరకు ఆ సినిమా కోసం ఇండియన్ సినిమా బాగా ఎదురుచూసుంది. అయితే టీజర్ రావడంతో మొత్తంగా పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత మార్పులు చేసి, చేశాం అని చెప్పి రిలీజ్ చేసినా ఫలితం చేదే. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చినా అదే పరిస్థితి అంటున్నారు.
థియేటర్లలో తుస్ మన్న కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చి విజయాలు సాధిస్తాయి. మరీ కాకపోతే అంతటి నెగిటివ్ ఫలితాన్ని అందుకోవు. కాస్త అయినా ఫర్వాలేదు అనిపించుకుంటాయి అని చెబుతుంటారు. థియేటర్ సినిమాకు కొన్ని మార్పులు చేసి రిలీజ్ చేసినా, రిలీజ్ తర్వాత థియేటర్ సినిమాలో చేసిన ఛేంజస్‌తో ఓటీటీలోకి వస్తాయి కాబట్టి కాస్త ఫర్వాలేదనిపించుకుంటాయి. అలా ‘ఆదిపురుష్’ సినిమా కూడా ఓటీటీలోకి వచ్చింది. కానీ ఇక్కడ కూడా థియేటర్లలో వచ్చిన స్పందనే వస్తోంది. మీమర్స్ కూడా అదే తరహాలో ఆడుకుంటున్నారు.
ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. మోస్ట్ అవైటెడ్ మూవీగా థియేటర్లలో వచ్చి మోస్ట్ హేట్‌రెడ్ అందుకున్న మూవీగా మారింది. సినిమా వచ్చాక కొన్ని సన్నివేశాలు, సంభాషణల విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆంజనేయుడి పాత్ర చిత్రణ, రావణుడి పాత్ర విషయంలో విజువల్ ఎఫెక్ట్స్, కొన్ని సంభాషణలు సినిమాను బాగా ఇబ్బందిపెట్టాయి. దీంతో కొన్ని సంభాషణలు మార్చారు. అయినా ఓటీటీలో చూసి విమర్శకులు విమర్శిస్తూనే ఉన్నారు.
కారణం సమస్య కేవలం డైలాగ్‌లతోనే కాదు, ప్రభాస్ లుక్‌లు, సైఫ్ గ్రాఫిక్స్, కథను నెరేట్ చేసిన విధానం ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. వీటిని ఓటీటీ కోసం మార్చలేరు కాబట్టి మాటలు అయితే పడుతున్నారు. కొందరు అయితే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురాకపోతేనే బాగుండు అని కూడా అంటున్నారు. కానీ ఏం చేస్తారు టీమ్ అయినా మాటలు పడుతున్నారు అంతే.