తెలుగులో వైవిధ్యమైన సినిమాలు రావాలని ప్రేక్షకులు కోరుకుంటారు. కానీ ఆ కథలు సిద్ధమవుతున్నప్పుడు, నిర్మాతల కోసం వెతుకుతున్నప్పుడు, ఒకవేళ నిర్మాతలు దొరికా ఆ కథ చెప్పి ఒప్పించినప్పుడు… ఆ రచయిత, దర్శకులు పడే కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. అలా ‘క్షణం’ సినిమా గురించి పడ్డ కష్టాన్ని అడివి శేష్ చెబుతుంటే… ఆ సినిమా వెనుక ఇంత కష్టం ఉందా అనిపించంది. ఆ సినిమాకు ఆయన హీరో మాత్రమే కాదు… రచన కూడా చేసిన విషయం తెలిసిందే.
‘క్షణం’ స్క్రిప్ట్ కోసం అడివి శేష్, దర్శకుడు రవికాంత్ ఏడు నెలలు కూర్చొని రాసుకున్నారట. ఆ సమయంలో ఆ సినిమా నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా ఆఫీసులో ఉద్యోగులు అదోలా చూసేవారట. చిన్న కథ పట్టుకొని… ఇన్ని రోజులు ఇలా చేస్తున్నారు అనుకునేవారట. అలాంటి సందర్భంలో ఓ రోజు పీవీపీ వచ్చి… కాన్ఫ్‌రెన్స్ హాల్ తన స్నేహితులతో కథ చెప్పమని అడిగారట. అలా శేష్, రవికాంత్ కలసి… పీవీ, నిరంజన్‌రెడ్డి, ఇంకొంతమందికి కధ నెరేట్ చేశారట.
ఈ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కో పాయింట్ చెబుతూ… మారిస్తే బాగుంటుంది అన్నారట. ఒకతను అయితే ఏకంగా సినిమా స్క్రిప్టే మార్చాలి అన్నారట. దీంతో శేష్ గుండె ఒక్కసారిగా జారినట్లు అనిపించిందట. ‘మా ఏడు నెలల కష్టం బూడిదలో పోసినట్లయింది’ అనుకున్నారట. అదే సమయంలో నిరంజన్ రెడ్డి వచ్చి… పీవీపీని బయటికి తీసుకెళ్లి మాట్లాడారట. కాసేపు మాట్లాడి వచ్చి… ‘ఈ సినిమా చేస్తున్నాం’ అని అన్నారట నిరంజన్ రెడ్డి. దాంతో శేష్ అండ్ టీమ్ పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లు అయ్యిందట. ఇదీ ‘క్షణం’ కథ పురిటినొప్పులు.