ఐశ్యర్య రాజేష్.. తెలుగు మూలాలున్నా కానీ తమిళ నాట ప్రతిభగల నటిగా మంచి పేరు తెచ్చుకుంది.. అంతకుముందు రాజేంద్ర ప్రసాద్ ‘రాంబంటు’ లో (1996) బాలనటిగా కనిపించింది.. కోలీవుడ్‌లో 2010లో ‘నీతన అవన్’ మూవీతో కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘మిస్ మ్యాచ్’ ‘రిపబ్లిక్’ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది.. కోలీవుడ్‌లో ఫస్ట్ మూవీతోనే టాలెంటెడ్ యాక్ట్రస్ అని ప్రూవ్ చేసుకుంది..
రచయితలు, దర్శకులు తనను దృష్టిలో పెట్టుకునే క్యారెక్టర్లు రాయడం.. తన కోసమే లేడీ ఓరియంటెడ్ కథలు రెడీ చేసేవారు.. సాధారణంగా హీరోయిన్లంటే ఆకర్షణీయంగా కనిపించాలి.. తెరమీద హీరోతో ఆడిపాడాలి.. అందాలు ఆరబోయాలి.. రొమాంటిక్ సీన్స్‌లో రెచ్చిపోవాలి.. కానీ ఇవేమీ ఐశ్వర్యకు పనికి రావు.. కేవలం కథ, క్యారెక్టర్ మాత్రమే చూస్తుందామె.. వయసు ఎక్కువైన పాత్ర అయినా సరే తన నేచురల్ పర్ఫార్మెన్స్‌తో రక్తి కట్టించగల ప్రతిభావంతురాలు..‘కాకాముట్టై’ లో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించి అలరించిన ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు ముగ్గురు పిల్లల తల్లిగా కనిపించనుంది..
తమిళనాట నెల్సన్ వెంకటేషన్ డైరెక్ట్ చేస్తున్న‘ఫర్హానా’ అనే మూవీలో ఐశ్వర్య నటిస్తోంది. ఇంతకు ముందు ‘ఒరునాళ్ కత్తు’, ‘మాన్‌స్టర్’ చిత్రాలను తెరకెక్కించి పరిశ్రమతో పాటు ప్రేక్షకుల్లో దర్శకుడిగా మంచి క్రేజ్ సంపాదించాడు నెల్సన్. ఓ డిఫరెంట్ పాయింట్, విభిన్నమైన కథ, కథనాలతో ఆయన ఈ ‘ఫర్హానా’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ప్రకాష్, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు.
గురువారం (డిసెంబర్ 16) ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.. ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. రమేష్ కీలక పాత్రలో, డైరెక్టర్ కమ్ యాక్టర్ సెల్వ రాఘవన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ‘ఫర్హానా’ కు జస్టిస్ ప్రభాకర్ సంగీతమందిస్తున్నారు.. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.. రిపబ్లిక్ డే కానుకగా 2023 జనవరి 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..